ఆస్ట్రేలియా మాజీ బౌలర్ అలాన్ థామ్సన్ (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్ తీసిన ఘనత ఆయనకే దక్కింది. 1971 జనవరి 5న ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. దీంట్లో తొలి వికెట్ పడగొట్టి అరుదైన రికార్డు నమోదు చేశారు థామ్సన్. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అలాన్ 22 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించారు.
కొన్ని రోజులు కిందట అతనికి తుంటి గాయం సర్జరీ జరిగింది. కానీ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. అఖరికి అలాన్ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు అని అతడి సోదరుడు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. కాగా విక్టోరియాకు చెందిన అలాన్ ఆస్ట్రేలియా తరపున ఒక వన్డే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడారు. నాలుగు టెస్టులు ఆడిన అలాన్ 12 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే అతనిని ముద్దుగా ఫ్రాగీ అని పిలిచేవారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో విక్టోరియా తరపున 44 మ్యాచ్‌లు ఆడిన అలాన్ 184 వికెట్లు పడగొట్టారు.
