SKY Out of IPL:ముంబైకి మరో భారీ షాక్

ఐపీఎల్‌-2022 సీజన్ లో ముంబై ఇండియన్స్‌ మరో ఓటమి చవిచూసింది.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 12:50 PM IST

ఐపీఎల్‌-2022 సీజన్ లో ముంబై ఇండియన్స్‌ మరో ఓటమి చవిచూసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓటమి చెందింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. అయితే అసలే ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఇప్పుడు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 6వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఎడమ చేతికి గాయమైంది.

దీంతో ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు అని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే చక్కటి ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ లాంటి ఆటగాడు దూరమవడం ముంబయి ఇండియన్స్ రాబోయే మ్యాచ్‌లపై కచ్చితంగా ప్రభావం చూపనుంది…
ఐపీఎల్ 2022లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 145.67 స్ట్రయిక్ రేట్, 43.28 సగటుతో 303 పరుగులు చేశారు. ఆడిన 8 మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇదిలాఉంటే ఐపీఎల్ 15వ సీజన్ ముంబై ఇండియన్స్ జట్టుకి అస్సలు కలిసిరాలేదనే చెప్పాలి. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ ఏ ఒక్కరూ రాణించకపోవడంతో సమష్టి లోపంతో ఇప్పటివరకూ 11 మ్యాచ్చులాడిన రోహిత్ సేన 9 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2008 నుంచి ఇప్పటిదాకా 15 సీజన్లలో ఆడిన ముంబయి ఇండియన్స్ జట్టు ఒకే సీజన్‌లో అత్యధికంగా 8 సార్లే ఓటమిపాలైంది. కానీ, ఈ సీజన్‌తో ఆ రికార్డును బద్దలుకొట్టింది.. ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి 3 మ్యాచులను చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో ఆడనుంది.