Dinesh Karthik: డీకేపై కపిల్ దేవ్ ప్రశంసలు

దినేష్ కార్తీక్...ప్రస్తుతం భారత్ క్రికెట్ లో మారుమోగిపోతోన్న పేరు.

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 07:25 PM IST

దినేష్ కార్తీక్…ప్రస్తుతం భారత్ క్రికెట్ లో మారుమోగిపోతోన్న పేరు. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఆటగాళ్ళు అందరూ ఈ వెటరన్ వికెట్ కీపర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా చేరాడు. దినేష్ కార్తీక్ ను ఆకాశానికి ఎత్తేశాడు. నిజానికి దినేష్ కార్తిక్ కెరీర్ ముగిసినట్టేననీ రెండేళ్ల క్రితం చాలా మంది భావించారు. అయితే ఒక్క ఐపీఎల్ సీజన్ తో మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఐపీఎల్ 15వ సీజన్ లో ఆర్సీబీ తరపున ఫినిషర్ రోల్ తో అదరగొట్టాడు.
తాజాగా అతని ప్రదర్శనపై లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ స్పందించాడు. అతని ఆటతీరును పొగడటానికి మాటలు చాలవని కపిల్ ప్రశంసించాడు. ఈసారి అతను ఎంత బాగా ఆడాడంటే.. సెలక్టర్లకు తనను విస్మరించే అవకాశం ఇవ్వలేదనీ కపిల్ వ్యాఖ్యానించాడు.
రిషబ్‌ పంత్‌ యువకుడనీ , అతను ఇంకా చాలా క్రికెట్‌ ఆడాల్సి ఉందన్నాడు. కార్తీక్‌కు అనుభవంతో పాటు అలాంటి ఆట కూడా ఉందన్న కపిల్ అందుకే అతన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ఈ సందర్భంగా డీకే ను ధోనీతో పోలుస్తూ కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ధోనీ కంటే ముందు నుంచీ కార్తీక్‌ క్రికెట్‌ ఆడుతున్నాడనీ, ధోనీ రిటైరై రెండేళ్లయిపోయినా కార్తీక్‌ మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నాడనీ కపిల్ గుర్తు చేసాడు. ఆట పట్ల ప్రేమ ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే ఉండటం అంత సులువు కాదని అభిప్రాయ పడ్డాడు. కార్తీక్‌ ఎన్ని బాల్స్‌ ఆడాడు అన్నది కాదనీ, ఎప్పుడూ తనేంటో నిరూపించుకుంటాడనీ ఐపీఎల్‌లోనూ అదే జరిగిందన్నాడు.