Site icon HashtagU Telugu

Surya Kumar Yadav: ఈ SKYకి ఆకాశమే హద్దు

Sky Imresizer (1)

Sky Imresizer (1)

సూర్యకుమార్ యాదవ్… భారత క్రికెట్ అభిమానులు ముద్దుగా స్కై(SKY) అని పిలుపుకుంటారు. ఐపీఎల్ లో చాలా సార్లు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. జాతీయ జట్టులోకి పిలుపు కాస్త ఆలస్యంగానే అందినా… వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.

టీ ట్వంటీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరువలో ఉన్న సూర్యకుమార్ తాజాగా ఆసియాకప్ లో హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చిన తొలి రెండు బంతులను స్వీప్ షాట్లతో బౌండరీకి తరలించాడు. ఆయూష్ శుక్లా వేసిన 18వ ఓవర్‌లో సూర్య రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన సూర్య.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సిక్స్‌లు కొట్టి భారీ జట్టుకు 192 పరుగుల భారీ స్కోర్ అందించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే హైలెట్‌గా చెప్పాలి.

ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడిన సూర్య కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హరూన్‌ రషీద్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. సూర్య.. తన హాఫ్‌ సెంచరీని కేవలం 22 బంతుల్లోనే పూర్తి చేశాడంటే, అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ చివరి ఐదు ఓవర్లలో 78 పరుగులు చేసింది. కీలకమైన టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు సూర్యకుమార్ ఫామ్ కొనసాగిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Cover Image: BCCI Twitter