Team India Focus: సీరీస్ విజయంతో ముగిస్తారా ?

టెస్ట్ సీరీస్ డ్రాగా ముగిసింది...టీ ట్వంటీ సీరీస్ లో భారత్ దే పై చేయిగా నిలిచింది..ఇక వన్డే సీరీస్ లో ఇరు జట్లూ సమంగా ఉన్న వేళ సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ కు అంతా సిద్ధమయింది.

  • Written By:
  • Publish Date - July 17, 2022 / 11:03 AM IST

టెస్ట్ సీరీస్ డ్రాగా ముగిసింది…టీ ట్వంటీ సీరీస్ లో భారత్ దే పై చేయిగా నిలిచింది..ఇక వన్డే సీరీస్ లో ఇరు జట్లూ సమంగా ఉన్న వేళ సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ కు అంతా సిద్ధమయింది. మాంచెస్టర్ వేదికగా భారత్ , ఇంగ్లాండ్ చివరి వన్డే జరగనుంది. తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొడితే…రెండో మ్యాచ్ లో దెబ్బకు దెబ్బ తీసిన ఇంగ్లాండ్ సీరీస్ సమం చేసింది. ఇప్పుడు మూడో వన్డే లో గెలిచి సీరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. గత మ్యాచ్ లో బౌలర్లు అద్భుతంగా రాణించినా బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ చిత్తుగా ఓడిపోయింది.

రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ మరో సారి కీలకం కానుండగా,శిఖర్‌ ధావన్‌ ఆట కూడా ఆందోళన కలిగిస్తోంది. వచ్చే టూర్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్న ధావన్‌ తన పాత శైలిలో దూకుడుగా ఆడలేకపోతున్నాడు. ఓపెనర్లు ఇచ్చే ఆరంభంపైనే భారత్ భారీ స్కోరుకు పునాది పడుతుంది. ఇక అన్ని వైపులనుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్‌ కోహ్లి ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే వెస్టిండీస్‌ టూర్‌నుంచి కూడా దూరంగా ఉండనున్న కోహ్లి తన ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. మిడిలార్డర్‌లో పంత్‌ తన దూకుడును ప్రదర్శించాల్సి ఉంది. సూర్యకుమార్, హార్దిక్, జడేజా మరోసారి బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. అయితే గత కొంత కాలంగా బౌలర్‌గా పూర్తిగా విఫలమవుతున్న జడేజా ఏమాత్రం రాణిస్తాడో చూడాలి. బౌలర్ల విషయానికొస్తే బుమ్రా, షమీ బాగా రాణిస్తున్నారు. స్పిన్నర్ చాహల్ కూడా అదరగొడుతున్నాడు. మిగిలిన యువ బౌలర్లలో అనుభవలేమి సమస్యగా మారింది. గత మ్యాచ్ లో ప్రధాన బ్యాటర్లను త్వరగానే ఔట్ చేసినా టేయిలెండర్ ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు.

మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడినా రెండో మ్యాచ్ లో అద్భుతంగా పుంజుకున్న ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. జేసన్ రాయ్, రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ లాంటి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. వీరు గత రెండు వన్డేల్లో స్థాయికి తగినట్టు ఆడకున్నా సీరీస్ డిసైడర్ కావడంతో రాణించే అవకాశం ఉంది.
ఆల్‌రౌండర్లు విల్లీ, అలీ రెండో మ్యాచ్‌లో ఆదుకున్నారు. వీరిద్దరు ఈ సారి కూడా కీలక పాత్ర పోషించనున్నారు. బౌలింగ్‌లో టాప్లీతో పాటు ఇతర పేసర్లు రాణించాల్సి ఉంది. రెండో వన్డేలో టాప్లీ 6 వికెట్లతో విజృంభించాడు. అతడితో భారత బ్యాటర్లు ఎలా ఆడతారనేది చూడాలి.