Site icon HashtagU Telugu

KL Rahul: జింబాబ్వేతో వన్డే సిరీస్.. రాహుల్ ఫిట్ నెస్ , కెప్టెన్సీకి తొలి పరీక్ష

KL Rahul

KL Rahul

వరుస పర్యటనలతో బిజీగా ఉన్న టీమిండియా ఇప్పుడు మరో సీరీస్ కు రెడీ అయింది. ఇవాళ్టి నుంచే జింబాబ్వే తో వన్డే సీరీస్ ఆడనుంది. సీనియర్ ప్లేయర్స్ రెస్ట్ తీసుకోవడంతో యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. కె ఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగనున్న భారత్ ను ఫేవరెట్
గా చెబుతున్నా ఆతిథ్య జింబాబ్వే ను తక్కువ అంచనా వేయలేం. అయితే ఈ టూర్ కే ఎల్ రాహుల్ ఫిట్ నెస్, అతని కెప్టెన్సీ కి పరీక్షగా చెప్పొచ్చు. సర్జరీతో రెండు నెలలుగా ఆటకు దూరమైన రాహుల్‌ ఇక్కడ త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 100 ఓవర్ల పాటు మైదానంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలి. సారథిగా జట్టును నడిపించాలి. టాపార్డర్‌లో బ్యాట్‌తో రాణించాలి. అలాగే
గాయంతో ఫిబ్రవరి నుంచి అసలు మైదానంలోకే దిగని దీపక్‌ చహర్‌ సుమారు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ల కోసం అతన్ని పరిశీలించాలంటే అందుబాటులో ఉన్న ఈ కొద్ది మ్యాచ్‌ల్లోనే ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవాలి. ధావన్, గిల్, సామ్సన్‌ అంతా ఫామ్‌లోనే ఉన్నారు. బౌలింగ్‌లోనూ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, స్పిన్నర్లు అక్షర్‌ పటేల్, కుల్దీప్‌లతో భారత జట్టే బలంగా ఉంది. సొంతగడ్డపై ఉన్న అనుకూలతలతో, ఇటీవలి విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే తహతహలాడుతోంది. గత రికార్డుల పరంగా భారత్ దే పై చేయిగా ఉంది. భారత్‌ 51 మ్యాచ్‌ల్లో, జింబాబ్వే 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. జింబాబ్వే గడ్డపై జింబాబ్వేతో 23 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న హరారే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.