Florida T20: భారత్‌, విండీస్ ఆటగాళ్ళ వీసా సమస్య క్లియర్

సస్పెన్స్‌కు తెరపడింది...భారత్, వెస్టిండీస్ చివరి రెండు టీ ట్వంటీలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 02:36 PM IST

సస్పెన్స్‌కు తెరపడింది…భారత్, వెస్టిండీస్ చివరి రెండు టీ ట్వంటీలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. గయానా అధ్యక్షుడి జోక్యంతో టీమిండియా, వెస్టిండీస్‌ ఆటగాళ్ల వీసా సమస్యలు తొలిగిపోయాయి. టీ ట్వంటీ సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఇరు జట్లూ బుధవారమే ఫ్లోరిడా వెళ్లాల్సి ఉంది. అయితే వీసాలు రాకపోవడంతో గందరగోళం నెలకొంది. విండీస్ బోర్డు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో ముందు ఇరు జట్లనూ గయానాలోని జార్జ్‌టౌన్‌కు పంపించారు. అక్కడ వీసాలకు అపాయింట్‌మెంట్ బుక్ చేశారు. ఈ దశలో కూడా కాస్త ఇబ్బందులు తలెత్తాయి. మొదట అమెరికా ఎంబసీ అడ్డుచెప్పింది. దీంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎంబసీ అధికారులతో చర్చించి ఆటగాళ్ల వీసాలకు సంబంధించిన ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎట్టకేలకు ఇవాళ వీసాలు జారీ అయ్యాయి.

నేటి రాత్రి వరకూ భారత్‌, విండీస్‌ ఆటగాళ్లు ప్లోరిడాకు చేరుకోనున్నారు. దీంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీకి విండీస్ క్రికెట్ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఇర్ఫాన్‌ అలీ జోక్యంతోనే ఇరుజట్ల ఆటగాళ్లకు వీసా క్లియరెన్స్‌ వచ్చిందనీ, గయానా అధ్యక్షుడి నుంచి ఇది గొప్ప ప్రయత్నమని థాంక్య్ చెబుతూ విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రికీ స్కెరిట్‌ వ్యాఖ్యానించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి టీ ట్వంటీ భారత్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో పుంజుకున్న విండీస్ సిరీస్ సమం చేసింది. అయితే మూడో టీ ట్వంటీలో పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ ఆధిక్యం సాధించింది. శనివారం నాలుగో టీ ట్వంటీ, ఆదివారం ఐదో టీ ట్వంటీ ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి.