తొలి వన్డే ఓటమితో కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో బాగానే కనిపించినా… చివరికి పరాజయం పాలైంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శార్ధూల్ ఠాకూర్ అర్థ శతకాలతో రాణించినప్పటికి.. మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే తొలి వన్డేలో భారత్ జట్టు ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్ పేలవ నిర్ణయాలు కారణమని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తొలి వన్డేకి ముందు యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఆరో బౌలర్ గా తుది జట్టులోకి తీసుకోబోతున్నట్లు చెప్పిన కేఎల్ రాహుల్.. మ్యాచ్‌లో మాత్రం అతనితో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ఒకవేళ వెంకటేశ్ అయ్యర్‌ని కేవలం బ్యాటర్ గా మాత్రమే తుది జట్టులోకి తీసుకుని ఉంటే.. అతని కంటే సూర్యకుమార్ యాదవ్ మెరుగైన బ్యాటర్ అంటున్నారు మాజీలు.
అలాకాకుండా ఆల్‌రౌండర్ గా వెంకటేష్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకుని.. బౌలింగ్ చేయించకపోవడం తనని ఆశ్చర్యపరిచిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన వెంకటేశ్ అయ్యర్‌కి ఆఖరి ఓవర్లలోనూ బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. అలాంటి ఆటగాడి చేతికి బంతి ఇవ్వకపోవడం కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వైఫల్యానికి నిదర్శనమని మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోయిన సందర్భంలో వెంకటేశ్ అయ్యర్ ను దించి ఉంచే వికెట్లు పడగొట్టకున్నా మార్పు కనిపించేదని అభిప్రాయపడుతున్నారు.కోహ్లీతో పోలిస్తే రాహుల్ కెప్టెన్సీ దూకుడుగా లేకపోవడం, బౌలింగ్ , ఫీల్డింగ్ మార్పులకు సంబంధించి సరైన వ్యూహలతో జట్టును నడిపించలేకపోయాడన్న విమర్శ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలోనైనా రాహుల్ సారథ్యం ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.