India Squad for Sri Lanka Tour : గంభీర్ మార్క్ మొదలైనట్టే..మాట నెగ్గించుకున్న కొత్త కోచ్

ద్రావిడ్ స్థానంలో బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ కు శ్రీలంక సిరీస్ తో కోచ్ గా ప్రస్థానం మొదలుకాబోతోంది

  • Written By:
  • Publish Date - July 18, 2024 / 09:05 PM IST

టీమిండియా కోచ్ (Team India Coach) పదవి అంటేనే కత్తి మీద సాము లాంటిది… ఎన్నో అంచనాలు…మరెన్నో సవాళ్ళు.. అన్నింటికీ మించి చాలా ఒత్తిడి… ఇలాంటి పరిస్థితుల మధ్య జట్టు కోచ్ గా వ్యవహరిస్తూ విజయాలు సాధించాల్సి ఉంటుంది… గతంలో కొందరు ఈ పదవిలో సక్సెస్ అయితే మరికొందరు ఫెయిలయ్యారు. గత దశాబ్దకాలంగా మాత్రం కోచ్ గా సక్సెస్ అయిన వారిలో కిరిస్టెన్, ద్రావిడ్ ఉన్నారు. ఇప్పుడు ద్రావిడ్ స్థానంలో బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ కు శ్రీలంక సిరీస్ (Sri Lanka) తో కోచ్ గా ప్రస్థానం మొదలుకాబోతోంది. కోచ్ గా ఎంపికయ్యే ముందే తాను పెట్టిన కండీషన్లను బీసీసీఐ అంగీకరించేలా చేశాడు. ప్రస్తుతం ఈ కండీషన్ల ప్రకారం చూస్తే కోచ్ గా తొలి సిరీస్ కు తన పంతం నెగ్గించుకున్నాడనే చెప్పాలి. జట్టు ఎంపికలో తన నిర్ణయాలే ఫైనల్ గా ఉండాలన్నది గంభీర్ పెట్టిన ప్రధాన కండీషన్.. తాజాగా శ్రీలంక టూర్ కు జట్టు ఎంపికలో గంభీర్ మాట బాగానే పనిచేసినట్టుంది. సీనియర్లు కూడా ఈ సిరీస్ ఆడాల్సిందేనని గంభీర్ స్పష్టంగా చెప్పడం… వెంటనే రోహిత్ శర్మ తర్వాత కోహ్లీ కూడా అంగీకరించక తప్పలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎక్కువ పరిమిత ఓవర్ల సిరీస్ లు లేకపోవడంతోనే గంభీర్ సీనియర్లను ఆడించేలా చొరవ తీసుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు టీ ట్వంటీ కెప్టెన్ ఎంపిక విషయంలోనూ గంభీర్ (Gautam Gambhir) పై చేయి సాధించాడు. నిజానికి రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత అతని వారసునిగా మరో మాట లేకుండా హార్థిక్ పాండ్యాకే అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. గతంలో పలు సిరీస్ లకు సారథిగా ఉండడం, ఇటీవల వరల్డ్ కప్ తో ఫామ్ అందుకోవడంతో హార్థిక్ కే టీ ట్వంటీ కెప్టెన్సీ ఇస్తారని దాదాపుగా నిర్ణయానికొచ్చేశారు. అయితే గంభీర్ రాకతో సీన్ రివర్సయింది. కెప్టెన్ గా హార్థిక్ ను వద్దన గంభీర్ సూర్యకుమార్ యాదవ్ పేరును సిఫార్సు చేశాడు. ఈ విషయంలో సెలక్షన్ కమిటీ రెండుగా విడిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి. కొందరు హార్థిక్ వైపు నిలబడితే.. మరికొందరు సూర్యకుమార్ కు మద్ధతిచ్చారు. అయితే 2026 టీ ట్వంటీ వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్టు గంభీర్ చెప్పాడు. ముఖ్యంగా ఫిట్ నెస్ సమస్యలు పాండ్యాకు ప్రతికూలంగా మారాయి. కెప్టెన్ అయితే అన్ని మ్యాచ్ లూ తప్పనిసరిగా ఆడాల్సి వస్తుందని, తరచూ గాయాల బారిన పడే హార్థిక్ తో ఇదే కుదిరే పని కాదని సెలక్టర్లను ఒప్పించిన గంభీర్ సూర్యకుమార్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇప్పించడంలో సక్సెస్ అయ్యాడు. వెనక్కి తగ్గే మనస్తత్వం లేని గంభీర్ తనదైన మార్క్ చూపిస్తూ తొలి టూర్ కు జట్లను ఎంపిక చేసుకున్నాడు.

Read Also : Ram Charan : చరణ్ కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఇంటర్నేషనల్ బాక్సర్.. RC16 కోసం ట్రైనింగ్..!