DPL T20 Records: ఒకప్పుడు వన్డే క్రికెట్ లో 250 పరుగులంటే కామన్ స్కోరుగా ఉండేది.. గత కొన్నేళ్ళుగా 300 పరుగుల పైనే స్కోర్లు నమోదవుతుండడం సర్వసాధారణంగా ఉంటోంది. ఇక టీ ట్వంటీ ఫార్మాట్ లో 200 పైగా స్కోరును చాలా సార్లే కనిపిస్తున్నాయి.. అయితే పొట్టి క్రికెట్ లో 300కు పైగా స్కోరు అంటే పెద్ద రికార్డే. తొలిసారి భారత్ కు చెందిన ఒక టీమ్ ఈ ఘనతను సాధించింది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 308 పరుగుల స్కోరు చేసి రికార్డులకెక్కింది. ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదౌనీ , ప్రియాన్ష్ ఆర్యా ప్రత్యర్థి నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కొడితే బౌండరీ… లేకుంటే సిక్సర్ అన్న రీతిలో వారి బ్యాటింగ్ సాగింది. ముఖ్యంగా ఆయుష్ బదౌనీ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సునామీ ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే 165 పరుగులు చేశాడు. బదౌనీ ఇన్నింగ్స్ లో ఏకంగా 19 సిక్సర్లున్నాయి.
అలాగే ప్రియాన్ష్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో నార్త్ ఢిల్లీ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. రెండో వికెట్ కు వీరిద్దరూ 283 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. కాగా టీ ట్వంటీ ఫార్మాట్ లో ఇది రెండో హయ్యెస్ట్ స్కోర్. గతంలో నేపాల్ జట్టు మంగోలియాపై 314 పరుగులు చేయగా.. ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీపై 287 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి. టీ ట్వంటీల్లో అత్యధిక స్కోర్ సాధించిన భారత క్రికెటర్ గా ఆయుష్ బదౌనీ రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఇన్నింగ్స్ లో మొత్తం 31 సిక్సర్లు నమోదయ్యాయి.
Also Read: DPLT20: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, ఢిల్లీ కుర్రాడి విధ్వంసం