శ్రీలంక పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. టీ ట్వంటీ సీరీస్ గెలిచిన భారత్ తాజాగా వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆరంభం నుంచీ తడబడింది. శ్రీలంక తొలి ఓవర్లోనే ఓపెనర్ హాసిని పెరేరా డకౌట్ అవగా తర్వాత వరుసగా విష్మీ గుణరత్నె , మాధవి పెవిలియన్ చేరారు. ఈ మూడు వికెట్లు రేణుకా సింగ్ కే దక్కాయి.
తర్వాత కెప్టెన్ చమిర ఆటపట్టు 45 బంతుల్లో 27, అనుష్క సంజీవని 44 బంతుల్లో 25 పరుగులు చేయగా…వీరిద్దరూ ఔటవడంతో లంక 81 రన్స్ కే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో అమ కాంచన 83 బంతుల్లో 47 పరుగులతో ఆడుకుంది. దీంతో లంక 173 రన్స్ కి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు, మేఘనా సింగ్, దీప్తి శర్మలు రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన 94 , షఫాలీ వర్మ 71 పరుగులతో చెలరేగారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్లు మధ్య అఖరి వన్డే గురువారం జరగనుంది