Fastest Badminton Smash: స్మాష్…బ్యాడ్మింటన్ అభిమానులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి ప్లేయర్ తిరిగి రిటర్న్ షాట్ కొట్టకుండా ప్రయోగించే షాట్…అత్యంత వేగంగా వచ్చే స్మాష్ ను రిటర్న్ చేయాలంటే చాలా కష్టం. ప్రస్తుతం ఈ స్మాష్ షాట్ తోనే తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ లో అత్యంత వేగంగా స్మాష్ కొట్టిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. కొరియా ఓపెన్ ఆడుతున్న సాత్విక్ , చిరాగ్ షెట్టి జోడీ థాయ్ లాండ్ జోడీతో మ్యాచ్ లో తలపడింది. ఈ మ్యాచ్ లో సాత్విక్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్ కొట్టాడు. దీంతో గతంలో మలేషియా ప్లేయర్ టాన్ బూన్ 494 కిలోమీటర్ల వేగంతో కొట్టిన రికార్డ్ బద్దలైంది. దీనిపై యోనెక్స్ కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సరికొత్త స్మాష్ రికార్డ్ నెలకొల్పిన సాత్విక్ సాయిరాజ్ ను అభినందించింది. అతను కొట్టిన స్మాష్ ఫార్ములావన్ కారు వేగం కంటే ఎక్కువగా ఉంది. దాదాపు పదేళ్ళ తర్వాత అత్యంత వేగవంతమైన స్మాష్ రికార్డును అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ బ్రేక్ చేయడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గత కొంతకాలంగా భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి జోడీ పలు అద్భుత విజయాలు సాధించింది. ప్రస్తుతం సాత్విక్- చిరాగ్ జోడీ కొరియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్ లో భారత జోడీ 21-16,21-14 స్కోర్ తేడాతో మూడో సీడ్ థాయ్ లాండ్ కు చెందిన సుపాక్ , కెడ్రాన్ పై విజయం సాధించింది. కాగా కొరియా ఓపెన్ టైటిల్ గెలిస్తే వరల్డ్ ర్యాంకింగ్స్ లో సాత్విక్ , చిరాగ్ జోడీ రెండో స్థానానికి చేరుకుంటుంది.
Read More: Asia Cup 2023: కొద్ది గంటల్లో భారత్,పాక్ పోరు… ఎక్కడో తెలుసా ?