world cup 2023: 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలవాలన్న కలకు భారత్ ఇక రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. టైటిల్ ఫేవరెట్ రేసులో అందరికంటే ముందున్న టీమిండియా అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ అదరగొడుతోంది. వరుసగా 5 విజయాల తర్వాత ఇంగ్లాండ్ పై మాత్రం మన బ్యాటింగ్ తడబడింది. మెగా టోర్నీలో తొలిసారి మొదట బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన అనుకున్న స్థాయిలో స్కోర్ చేయలేకపోయింది. గిల్ , కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఔటైన తర్వాత కనీసం 200 స్కోరైనా చేస్తుందా అనుకున్న వేళ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అతనికి తోడుగా కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించారు. ఫలితంగా భారత్ 229 పరుగుల స్కోర్ చేసింది. నిజానికి భారత్ సాధించిన ఐదు విజయాలూ ఛేజింగ్ లో వచ్చినవే. దీంతో ఇంగ్లాండ్ పై 229 పరుగుల స్కోర్ కాపాడుకుంటుందా అన్న ఆసక్తి, ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది.
వరల్డ్ కప్ గెలవాలంటే కేవలం బ్యాటింగ్ ఉంటేనే సరిపోదు. నాకౌట్ స్టేజ్ కు ముందు బౌలింగ్ సత్తా అది కూడా తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకునే సత్తా ఖచ్చితంగా ఉండాలి. ఒక విధంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ టీమిండియాకు పరీక్ష పెట్టిందనే చెప్పాలి. మన బౌలర్లు తొలి 5 ఓవర్లలో కాస్త అటు ఇటుగా కనబడినా… తర్వాత చెలరేగిపోయారు. ముఖ్యంగా బూమ్రా, షమీ పేస్ బౌలింగ్ కు ఇంగ్లాండ్ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేదు. బూమ్రా ఇచ్చిన జోష్ తో షమీ కూడా అదరగొట్టేశాడు. ఇంగ్లాండ్ ఐదు వికెట్లను 22 పరుగుల తేడాలో చేజార్చుకుంది. ముఖ్యంగా షమీ 4 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టడం టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు.
ఇక స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మాయాజాలంతో మెరిసాడు. 2 కీలక వికెట్లతో మ్యాచ్ ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తెచ్చేశాడు. ఓవరాల్ గా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉండడంతో వరుసగా ఆరో విజయాన్ని అందుకోవడమే కాదు సెమీస్ బెర్తును కూడా రోహిత్ సేన ఖరారు చేసుకుంది. ఎలాగూ సెమీస్ బెర్త్ ఖాయమవడంతో తర్వాతి మ్యాచ్ లలో తుది జట్టు కూర్పులో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. అయితే లీగ్ స్టేజ్ ను ఓటమి లేకుండా ముగించి సెమీఫైనల్ కు మరింత జోష్ తో రెడీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రోహిత్ సేన ఫామ్ చూస్తే ప్రపంచకప్ సాధించడం ఖాయమంటూ విశ్లేషిస్తున్నారు. తర్వాతి మ్యాచ్ లలో భారత్ శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ తో తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకూ అపజయం ఎరుగని ఏకైక జట్టు భారతే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Also Read: CBN’s Gratitude Concert : చంద్రబాబు గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న బండ్ల గణేష్..