Site icon HashtagU Telugu

Dinesh Karthik: దినేశ్ కార్తీక్…వయసు ఆ నంబర్ మాత్రమే

Dinesh Karthik Retirement

Dinesh Karthik Retirement

టీమిండియా వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో తన సూపర్ ఫామ్ ఈ సీరీస్ లోనూ కొనసాగిస్తూ దుమ్ము రేపుతున్నాడు. వయసు మీద పడుతున్నా తనలో దూకుడు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ అదరగొడతున్నాడు. 16 ఏళ్ల కార్తీక్ టీ ట్వంటీ కెరీర్ లో చాలామంది ఆటగాళ్లు వచ్చారు. వెళ్లారు. 2006 లో  ఇండియా తొలి టీ ట్వంటీ ఆడిన వారిలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ తప్ప మరెవ్వరూ జట్టులో లేరు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్ తో సహా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లు అప్పటికి ఇంకా సరిగా బ్యాట్ కూడా పట్టుకోలేని వయసులో ఉండుంటారు.

37 ఏళ్ళ వయసులో హాఫ్ సెంచరీ చేసిన కార్తీక్.. టీ ట్వంటీలలో భారత్ తరఫున లేటు వయసులో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. 2018లో ఇదే సఫారీ జట్టు మీద ధోని.. 36 ఏళ్ళ 229 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం కార్తీక్ వయసు 37 ఏళ్ళ 16 రోజులు. టీమిండియా ఆడిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ నుంచి మొదలు కీలక సందర్భాల్లో కార్తీక్ జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కార్తీక్ సభ్యుడు. 2016లో నిదాహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ పై అతడు చేసిన విధ్వంసం అభిమానులు ఎవ్వరూ మరిచిపోలేరు. తాజాగా దక్షిణాఫ్రికాతో కూడా అదే ఆటను రిపీట్ చేస్తున్నాడు. రాజ్ కోట్ లో కార్తీక్ ఆడుతున్నంతసేపూ స్టేడియం మొత్తం డీకే.. డీకే.. అన్న అరుపులతో హోరెత్తిపోయింది. కార్తీక్‌ కేవలం 27 బాల్స్‌లోనే 55 రన్స్‌ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.అతని జోరుతో టీమిండియా చివరి 5 ఓవర్లలోనే 73 రన్స్‌ చేసింది. కాగా తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన కార్తీక్.. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే వచ్చే టీ20 ప్రపంచకప్ లో భారత్ కు ఫినిషర్ దొరికనట్టేననీ అంచనా వేస్తున్నారు.