ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని చూసేందుకు కోల్‌కతాలోని వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంకు వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రూ. 5,000 అంతకంటే ఎక్కువ చెల్లించి టికెట్లు కొన్న ఫ్యాన్స్, కేవలం పది నిమిషాల వ్యవధిలోనే మెస్సీ మైదానం వీడటంతో ఆగ్రహంతో చెలరేగిపోయారు. గంటల తరబడి వేచి చూసినా, అభిమాన ఆటగాడిని సరిగా చూడలేకపోవడంతో నిరసనగా స్టేడియంలో బాటిళ్లు విసిరి, ఆందోళనకు దిగారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు మెస్సీని చుట్టుముట్టడం వల్లే సాధారణ అభిమానులకు దర్శనం దక్కలేదని ఫ్యాన్స్ మండిపడ్డారు.
AP Fibernet Case : చంద్రబాబు కు ఆ దిగులు అవసరం లేదు !!
మైదానంలోకి అడుగుపెట్టిన మెస్సీని అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చుట్టుముట్టేయడంతో, స్టేడియం చుట్టూ లాప్ చేయాలన్న అతని ప్రయత్నం విఫలమైంది. విపరీతమైన రద్దీ, గందరగోళం మధ్య మెస్సీ తన పర్యటనను కుదించుకోవాల్సి వచ్చింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో, తాము మోసపోయామని భావించిన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో స్టేడియంలోని హోర్డింగులను ధ్వంసం చేసి, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
ఈ అపార్థానికి, నిర్వహణా లోపానికి చింతిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా మెస్సీకి, ఫుట్‌బాల్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల ప్రకారం, ముఖ్యమంత్రి, మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మెస్సీ కలవాల్సి ఉంది. అయితే, స్టేడియంలో జరిగిన గందరగోళం, భద్రతా కారణాల దృష్ట్యా మెస్సీ తన మిగిలిన కార్యక్రమాలను రద్దు చేసుకుని, తన తదుపరి పర్యటన ప్రాంతమైన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ గందరగోళానికి కారణమైన ఈవెంట్ ఆర్గనేజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
