Site icon HashtagU Telugu

RCB: బెంగళూర్ కెప్టెన్ గా డుప్లెసిస్

Faf Du Plessis

Faf Du Plessis

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్‌ ఫాఫ్ డుప్లెసిస్ కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది. బెంగళూరు అభిమానుల్లారా … కొత్త కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్ కు స్వాగతం పలకండి అంటూ అతడి ఫొటోను తమ అధికారిక ట్విట్టర్ అలాంటి ద్వారా షేర్‌ చేసింది. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో డుప్లిసెస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది.. మెగా వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోటీ పడి మరి అతడిని బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది.

ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్నాడు. అయితే తర్వాత కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌ ఉంటాడని అంతా అనుకున్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మిస్టర్ 360 అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ యాజమాన్యం డుప్లిసెస్‌ వైపే మెగ్గు చూపినట్లు తెలుస్తోంది. గ‌తేడాది చెన్నైసూప‌ర్ కింగ్స్ ప్రాతినిధ్యం వ‌హించిన డుప్లెసిస్ 633 ప‌రుగుల‌తో టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. 2018 నుంచి 2021 వ‌ర‌కు చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ప్రొటీస్ జట్టు తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 23 మ్యాచ్‌లలో విజయాలు అందుకున్నాడు.
ఐపీఎల్‌ 2022వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుండగా ఇప్పటికే పలు జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. కాగా బెంగుళూరు కెప్టెన్సీ మార్పుతో ఈసారైనా ఐపీఎల్‌ కప్పు కొడుతుందో లేక మరోసారి నిరాశపరుస్తుందో అన్నది చూడాలి.