Umran Malik: విశాఖ టీ ట్వంటీ లో అతన్ని ఆడించండి

టీమిండియా కొత్త స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ అరంగేట్రానికి సమయం వచ్చినట్టే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 13, 2022 / 05:48 PM IST

టీమిండియా కొత్త స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ అరంగేట్రానికి సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. విశాఖ వేదికగా జరిగే మూడో టీ ట్వంటీ లో అతన్ని ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. అయితే ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పంత్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌లో 0-2 తేడాతో వెనకబడిపోయింది. ఇక ఈ సిరీస్‌ గెలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం చేజారుతుంది. అంతేగాక హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో ఇంత వరకు వరుస సిరీస్‌లు గెలిచిన టీమిండియా జోరుకు కూడా బ్రేక్‌ పడుతుంది.

ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు తేలిపోవడంతో 7 వికెట్ల తేడాతో పరాజయం తప్పలేదు. రెండో మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యం ఓటిమికి కారణమయింది. ఇక బౌలర్లలో సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఒక్కడే ఆకట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ మూడో టీ20 తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతడు టీమిండియాకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. తదుపరి మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను ఆడించాలనీ, అతడి ఎక్స్‌ట్రా పేస్‌ జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనను అంతా చూసారనీ, ఐపీఎల్ లో డేవిడ్‌ మిల్లర్‌ లాంటి హిట్టర్ ను ఉమ్రాన్‌ అవుట్‌ చేసిన విధానం అమోఘమన్నాడు. భారత జట్టులో ఉమ్రాన్‌ చేరిక తప్పకుండా ప్రభావం చూపుతుందని జహీర్ అభిప్రాయ పడ్డాడు.మూడో మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న విశాఖ స్టేడియం చిన్నగా ఉంటుందని , స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోవచ్చని జహీర్ వ్యాఖ్యానించాడు. అందుకే పేసర్ గా ఉమ్రాన్ ను తీసుకోవాలని సూచించాడు. ఐపీఎల్‌-2022లో ఉమ్రాన్‌ మాలిక్‌ 22 వికెట్లు పడగొట్టాడు.