Rishabh Pant: న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. దాదాపు ఆటగాళ్లందరూ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఆడి వస్తుండటంతో వారందరికీ తగినంత ‘గేమ్ టైమ్’ లభించింది. ఈ క్రమంలో జనవరి 7న భారత ఆటగాళ్లందరూ వడోదర (బరోడా)లో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు చేరుకుంటున్నారు. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం ఈ క్యాంప్‌కు కాస్త ఆలస్యంగా హాజరుకానున్నారు. దీని వెనుక ఉన్న కారణాన్ని కోచ్ స్వయంగా వెల్లడించారు.
రిషబ్ పంత్ నిర్ణయం
విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరపున లీగ్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ ఆడాలని పంత్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన బీసీసీఐ (BCCI) నుండి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. ఢిల్లీ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌ను జనవరి 8న ఆడనుంది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే పంత్ టీమ్ ఇండియా క్యాంప్‌లో చేరుతారు. ప్రస్తుతం పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచి ఇప్పటికే నాకౌట్ దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో పంత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీ తరపున ఆడటం విశేషం.
Also Read: గ్రీన్ ల్యాండ్‌పై ట్రంప్ చూపు.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు అర్థం ఇదేనా?!
కోచ్ వెల్లడించిన వివరాలు
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ జనవరి 8న మ్యాచ్ ఆడిన తర్వాతే పంత్ జాతీయ జట్టుతో కలుస్తారని ధృవీకరించారు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంత్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 42.4 సగటు, 112.76 స్ట్రైక్ రేట్‌తో 212 పరుగులు చేశారు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ తుది జట్టులో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ప్రాధాన్యతగా ఉన్నట్లు తెలుస్తోంది. పంత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ల కారణంగా జట్టుతో ఆలస్యంగా చేరనున్నారు.
