Site icon HashtagU Telugu

IPL: హై స్కోరింగ్ థ్రిల్లర్ లో లక్నో సూపర్ విక్టరీ

90

90

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. మరో నయా టీమ్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన తొలి పరాజయం నుంచి తేరుకున్న రాహుల్ సేన.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌‌పై అద్భుత విజయం సాధించింది. అద్భుతమయిన బ్యాటింగ్‌తో 211 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు ఉండగానే చేధించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జాయింట్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నాలుగు పరుగులకే ఔటవ్వగా.. మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప 50 పరుగులు ,మొయిన్ అలీ 35 పరుగులు చేసారు. అలాగే శివమ్ దుబె 49 , అంబటి రాయుడు 27, రవీంద్ర జడేజా 17 , ధోనీ 16 చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌, ఆండ్రూ టై, రవి బిష్ణోయి తలా రెండు వికెట్లు తీశారు.

అనంతరం చేదనకు లక్నో సూపర్​జెయింట్స్.. ఆరంభంలో ధీటుగా బదులిచ్చింది. ఆ జట్టు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ 26 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సులతో 40 పరుగులు చేయగా.. క్వింటన్ డికాక్‌ 45 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులతో రాణించాడు. డికాక్ ఔటైనా.. లక్నో స్కోర్ బోర్డు వేగం తగ్గలేదు. దీపక్ హుడా.. ఓ సిక్స్, ఫోర్ బాది ఔటవగా.. యువ ప్లేయర్ ఆయూష్ బదోనీతో కలిసి లూయిస్ చెలరేగాడు. సీఎస్‌కే ఆల్‌రౌండర్ శివమ్ దూబే వేసిన 19వ ఓవర్ ఆ జట్టు కొంపముంచింది. ఆ ఓవర్‌లో అతను 25 పరుగులు సమర్పించుకోవడంతో లక్నో విజయం లాంఛనమైంది. లూయిస్‌ 6 ఫోర్లు 3 సిక్సులు సాయంతో 55 పరుగులు, ఆయుష్ బదాని 9 బంతుల్లో 2 సిక్సులతో 19 పరుగులు చేశారు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి.