IPL 2023 Preview: ఐపీఎల్ కార్నివాల్‌కు అంతా రెడీ

భారీ షాట్లతో దుమ్ము రేపే బ్యాటర్లు... బుల్లెట్ లాంటి బంతులతో వారిని వణికించే బౌలర్లు...సిక్సర్ల హోరు.. బౌండరీల జోరు...

  • Written By:
  • Publish Date - March 31, 2023 / 12:12 AM IST

IPL 2023: భారీ షాట్లతో దుమ్ము రేపే బ్యాటర్లు… బుల్లెట్ లాంటి బంతులతో వారిని వణికించే బౌలర్లు…సిక్సర్ల హోరు.. బౌండరీల జోరు…వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్ ఐపీఎల్.. వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న ధనాధన్ లీగ్ మళ్ళీ వచ్చేసింది. దాదాపు 8 వారాల పాటు ప్రతీ సాయంత్రం ఇక క్రికెట్ వినోదమే. గతంతో పోలిస్తే కొన్ని కొత్త రూల్స్ ఎంట్రీ ఇచ్చిన వేళ ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆసక్తికరంగా సాగబోతోంది. కరోనా కారణంగా గత రెండేళ్ళూ కొన్ని వేదికలకే పరిమితవగా.. ఇప్పుడు మళ్ళీ హోమ్ అండ్ అవే ఫార్మాట్ లోనే అభిమానులను అలరించబోతోంది.
శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆరంభ వేడుకలతో 16వ సీజన్ షురూ కాబోతోంది. ఓపెనింగ్ సెర్మనీ తర్వాత జరిగే ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మొత్తం 10 జట్లు పాల్గొన బోతుండగా.. 12 నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. లీగ్ స్టేజ్ లో ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడుతుంది. లీగ్ మొత్తంలో 70 మ్యాచులు జరుగనున్నాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ కలిపి మొత్తం 74 మ్యాచులు జరుగుతాయి.

రిచ్చెస్ట్ క్యాష్ లీగ్ గత సీజన్లతో పోలిస్తే ఈ సారి సరికొత్తగా ఉండబోతోంది. కొన్ని కొత్త రూల్స్ తో మరింత వినోదాన్ని అందివ్వబోతోంది. దీనిలో ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తుది జట్టులో లేని ఆటగాడిని మ్యాచ్ మధ్యలో ఆడించడమే ఇంపాక్ట్ రూల్. ఈ రూల్ తో మ్యాచ్ ఫలితాలే మారిపోయే అవకాశాలు లేకపోలేదు. బిగ్ బాష్ లో సక్సెస్ అయిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను బీసీసీఐ తొలిసారి ఐపీఎల్ లో ప్రవేశపెట్టింది.దీనితో పాటు వైడ్ , నో బాల్స్ కు రివ్యూలు తీసుకునే అవకాశం ఉండడం, అలాగే బౌలర్ బంతిని వేసేటప్పుడు బ్యాటర్‌ ఏకాగ్రత దెబ్బతీసేలా ఫీల్డర్‌, వికెట్‌ కీపర్‌ దురుద్దేశపూర్వంగా కదిలినట్టు అంపైర్‌ గుర్తిస్తే ఫీల్డింగ్‌ జట్టుకు ఐదు రన్స్‌ జరిమానా విధించనున్నారు. ఇక స్లో ఓవర్ రేట్ కు ఫీల్డింగ్ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సిందే. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకుంటే 30 గజాల సర్కిల్‌ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్లనే అనుమతిస్తారు. ఈ కొత్త నిబంధనలతో 16వ సీజన్ మరింత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మినీ వేలం తర్వాత పలు జట్ల కూర్పు మారిపోవడంతో ఈ సారి హోరాహోరీ మ్యాచ్ లు కూడా ఖాయమని చెప్పొచ్చు. భారీ ధర పెట్టి కొన్న విదేశీ స్టార్ ప్లేయర్స్ , ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు యువక్రికెటర్లపై అంచనాలు , ఈ సీజన్ తర్వాత కొందరు స్టార్ ప్లేయర్స్ రిటైర్మెంట్ తీసుకునే అవకాశముందన్న వార్తల మధ్య మరో రెండు నెలల పాటు అభిమానులు ఐపీఎల్ మజాలో మునిగి తేలనున్నారు.