Site icon HashtagU Telugu

Decisions By Umpires: కొంపముంచుతున్న అంపైర్ల తప్ప్పుడు నిర్ణయాలు

Decisions By Umpires

Decisions By Umpires

Decisions By Umpires: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు (Decisions By Umpires) కొంపముంచుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా విషయంలో అంపైర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో గెలిచే మ్యాచ్ లు చేజారుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సిడ్నీ టెస్టులో కూడా బ్యాడ్ అంపైరింగ్ విధానం కనిపించింది. అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇదే బ్యాడ్ అంపైరింగ్ విధానం కనిపించింది. అంపైర్ తప్పుడు నిర్ణయాలతో మాజీ ఆటగాళ్లతో సహా క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు.

సిడ్నీ టెస్టులో విరాట్ కోహ్లీ తప్పుడు నిర్ణయంతో ఔట్ అయ్యాడు. అయితే కోహ్లి డీఆర్‌ఎస్ తీసుకోవడంతో విషయం తేటతెల్లమై నాటౌట్ అయ్యాడు. కోహ్లీ తర్వాత వాషింగ్టన్ సుందర్ విషయంలోనే ఇదే పద్ధతి రిపీట్ అయింది. వాషింగ్టన్ సుందర్ క్యాచ్ అవుట్ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌ అవుట్ అయ్యాడు. కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని ఆడేందుకు వాషింగ్టన్ సుందర్ ప్రయత్నించాడు. అయితే బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఫీల్డ్ అంపైర్ సైకత్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీని తర్వాత పాట్ కమిన్స్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ విల్సన్ చాలా సేపు రీప్లేలు చూసాడు. బంతి గ్లౌజ్‌ల దగ్గర నుంచి వెళ్ళింది. కానీ స్నికోమీటర్‌లో స్పైక్ లేనప్పటికీ, బంతి సుందర్ గ్లవ్స్‌కు తగిలి కీపర్‌కి వెళ్లిందని నిర్ణయించుకున్నాడు. దీంతో సుందర్ ఔట్ గా ప్రకటించాడు. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చకు దారితీసింది.

జోయెల్ విల్సన్ తప్పుడు నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డారు. టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. నన్ను క్షమించండి మీది పనికిరాని నిర్ణయం అంటూ మండిపడ్డారు. వాషింగ్టన్ సుందర్ వికెట్‌ విషయం‌లో బుమ్రా కూడా అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అటు సోషల్ మీడియాలోనూ అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై మండిపడుతున్నారు. ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్, జైస్వాల్ విషయంలోనూ ఇదే తప్పిదం చోటు చేసుకుంది.