India vs Sri Lanka 1st ODI: భారత్ , శ్రీలంక వన్డే సిరీస్ రసవత్తరంగా ప్రారంభమైంది. కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డే టైగా ముగిసింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. నిజానికి భారత్ సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో లంక బౌలర్లు చివర్లో అద్భుతంగా పోరాడారు. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ కూడా లంక స్కోరు దగ్గరే ముగిసింది.
అసలు ఈ మ్యాచ్ లో భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. హిట్ మ్యాన్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. అయితే ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవడంతో దెబ్బతీసింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా 132 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్ కు కీలకమైన 57 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే వీరిద్దరూ రెండు వరుస ఓవర్లలో ఔటవడం మ్యాచ్ ను మలుపు తిప్పింది.
తర్వాత శివమ్ దూబే ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. చివర్లో పుంజుకున్న లంక బౌలర్లు వరుస వికెట్లతో పైచేయి సాధించారు. 14 బంతుల్లో 1 పరుగే చేయాల్సి ఉండగా.. దూబే, అర్షదీప్ సింగ్ వెంటనే వెంటనే ఔటవడంతో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో అసలంక 3 , 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక స్కోర్ 200 దాటిందంటే వెల్లలాగే కారణం. 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లంకను వెల్లలాగే హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చివర్లో మూడు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. వెల్లలాగే 65 బంతుల్లో 67 పరుగులు చేయగా… ఓపెనర్ నిస్సంక హాఫ్ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ , అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ , దూబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీసారు. మూడు వన్డేల సిరీస్ లో రెండో మ్యాచ్ కొలంబోలోనే ఆదివారం జరుగుతుంది.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ఒంటిగంట వరకు దుకాణాలు, రెస్టారెంట్లు ఓపెన్: సీఎం రేవంత్