Site icon HashtagU Telugu

Eoin Morgan Retires: అంతర్జాతీయ క్రికెట్ కు మోర్గాన్ గుడ్ బై

Eoin Morgan

Eoin Morgan

ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్ లో ఉన్న మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
తాను సాధించిన దాని గురించి గర‍్వపడుతున్నానని, గొప్ప వ్యక్తులతో తన జ్ఞాపకాలు చిరకాలం గుర్తుపెట్టుకుంటానని తెలిపాడు. గత కొన్ని రోజులుగా అతని రిటైర్ మెంట్ పై బ్రిటిష్ మీడియా వరుస కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మోర్గాన్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మోర్గాన్‌ సారథ్యంలోనే ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. అయితే గత రెండేళ్లుగా మోర్గాన్ ఒక్క చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. టీ ట్వంటీ ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు వన్డేల్లో డకౌట్ అయ్యాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మెర్గాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన మోర్గాన్‌.. 16 సంవత్సరాల పాటు ఇంగ్లండ్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. 35 ఏళ్ల మోర్గాన్‌ ఇంగ్లండ్ తరపున 16 టెస్టులు, 248 వన్డేలు, 115 టీ ట్వంటీలు ఆడాడు.16 టెస్టుల్లో 700 పరుగులు చేయగా 2 శతకాలు, 3 అర్ధ సెంచరీలు చేశాడు. అలాగే 248 వన్డేల్లో 7701 పరుగులు చేయగా అందులో ఇందులో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 115 టీ ట్వంటీ ల్లో 14 హాఫ్ సెంచరీలతో 2458 పరుగులు చేశాడు. 2010 టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో మోర్గాన్ ఆటగాడిగా ఉన్నాడు. అటు 83 ఐపీఎల్ మ్యాచ్ లలో 1405 రన్స్ చేశాడు. ఇక సారథిగా ఇంగ్లాండ్ క్రికెట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ రికార్డ్ మోర్గాన్ కే దక్కింది. వన్డేల్లో 126 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా ఉన్న మోర్గాన్ 76 విజయాలతో 60 శాతం విన్నింగ్ రికార్డ్ దక్కించుకున్నాడు. ఇక అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించిన ధోనీ రికార్డును కూడా మోర్గాన్ సమం చేశాడు. రిటైర్ మెంట్ ప్రకటించిన మోర్గాన్ కు అభినందనలు వెల్లువెత్తాయి. మోర్గాన్‌.. ఇంగ్లీష్‌ క్రికెట్‌ రూపురేఖలను మార్చిన గొప్ప క్రికెటర్‌ అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొనియాడింది. మోర్గాన్‌ ఓ ఇన్నోవేటర్‌, ఓ మోటివేటర్‌, ఓ ఛాంపియన్‌ అంటూ ప్రశంసించింది. నీ వారసత్వం ఇలానే కొనసాగుతుంది.. థ్యాంక్యూ మోర్గాన్‌ అంటూ ట్విట్‌లో పేర్కొంది.