Gujarat Titans Team Penalised : చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings)పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు భారీ షాక్ తగిలింది. సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) తో పాటు తుది జట్టులో ఉన్న మిగిలిన ఆటగాళ్లు అందరికి జరిమానా పడింది. సీఎస్‌కే(CSK)తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదు చేయడమే ఇందుకు కారణం.
నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో గుజరాత్ విఫలమైంది. ఈ సీజన్‌లో గుజరాత్ ఇలా చేయడం ఇది రెండో సారి కావడం గమనార్హం. దీంతో జట్టు కెప్టెన్ అయిన గిల్‌కు రూ.24లక్షల జరిమానా విధించారు. ఇక జట్టులోని మిగిలిన ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్‌తో కలిపి 11 మంది ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం రెండింటిలో ఏదీ తక్కువ అయితే అది ఫైన్‌గా విధించబడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. తొలుత గుజరాత్ బ్యాటింగ్ చేసింది. సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103), శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 104) లు శతకాలతో చెలరేగడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లలో డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63), మోయిన్ అలీ (36 బంతుల్లో 56) లు రాణించారు.
Also Read : James Anderson Retirement: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్‌కు ముహూర్తం ఫిక్స్..!?
ఇక మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే ఓ దశలో 250 పరుగులు చేస్తామని అనుకున్నాము. అయితే.. చివరి రెండు మూడు ఓవర్లలో సీఎస్‌కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మేము అనుకున్న దానికంటే మరో 20 పరుగులకు తక్కువగానే చేశాము. మ్యాచ్ పరంగానే కాకుండా నెట్‌రన్ రేట్ పరంగా చూసుకున్నా కూడా 10-15 పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నట్లు గిల్ చెప్పాడు.