Site icon HashtagU Telugu

England vs India: మాంచెస్ట‌ర్ టెస్ట్‌.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్‌, పంత్ హాఫ్ సెంచ‌రీ!

England vs India

England vs India

England vs India: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా (England vs India) తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. దీంతో భారత్ బ్యాటింగ్ ముగిసింది. రెండవ రోజు ఆటలో కాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. నిన్న (బుధవారం) 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. కుంటుకుంటూనే ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని వారిపై ఆధిపత్యం చెలాయించాడు. అతను 75 బంతుల్లో 54 పరుగులు చేసి కీలకమైన అర్ధ సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

Also Read: PM Vishwakarma Scheme: పీఎం విశ్వకర్మ పథకం అంటే ఏమిటి? ఈ స్కీమ్ కింద ఏపీలో 2.22 ల‌క్ష‌ల మంది!

రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు సవాలు విసిరింది. ఈ ఇన్నింగ్స్‌లో గాయపడిన రిషభ్ పంత్ విరిగిన బొటనవేలుతో అద్భుతమైన అర్ధసెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఇది ఇంగ్లాండ్‌లో అతని ఐదో 50 ప్లస్ స్కోరు. ఈ ఘనతతో పంత్.. ఎంఎస్ ధోని, ఫరూఖ్ ఇంజనీర్‌లను అధిగమించాడు. ధోని, ఫరూఖ్ ఇద్దరి పేరిట నాలుగేసి 50 ప్లస్ స్కోర్లు మాత్రమే ఉన్నాయి.

భారత ఇన్నింగ్స్ సాగిందిలా

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు నాల్గవ టెస్ట్‌లో మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ తొలి వికెట్‌కు 94 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 98 బంతుల్లో 4 ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ కూడా తన తొలి టెస్ట్ అర్ధసెంచరీని (151 బంతుల్లో 7 ఫోర్లతో 61 పరుగులు) సాధించాడు. యశస్వీ జైస్వాల్ 107 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్ నుండి కేవలం 12 పరుగులు మాత్రమే వచ్చాయి. మొదటి రోజు 37 పరుగుల వద్ద గాయపడిన రిషభ్ పంత్.. నొప్పి ఉన్నప్పటికీ 75 బంతుల్లో 54 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

రవీంద్ర జడేజా 20 పరుగులు చేయగా లోయ‌ర్ ఆర్డ‌ర్‌ బ్యాట్స్‌మెన్ శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులతో విలువైన భాగస్వామ్యాలు అందించారు. అంశుల్ కంబోజ్ ఖాతా తెర‌వ‌లేదు. జస్‌ప్రీత్ బుమ్రా 4 పరుగుల వద్ద ఔటయ్యారు.

ఇంగ్లాండ్ బౌలింగ్

ఇంగ్లాండ్ తరపున కెప్టెన్ బెన్ స్టోక్స్ 72 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి భారత బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జోఫ్రా ఆర్చర్ 73 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. లియామ్ డాసన్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.