England Team: కివీస్ ను ఊడ్చేసిన ఇంగ్లాండ్

మూడో టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న న్యూజిలాండ్ ఆశలు ఫలించలేదు.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 09:25 AM IST

మూడో టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న న్యూజిలాండ్ ఆశలు ఫలించలేదు. ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి సత్తా చాటిన వేళ టెస్ట్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. పూర్తి ఆధిపత్యం కనబరిచి మూడో టెస్ట్‌లోనూ న్యూజిలాండ్‌ను 7 వికెట్లతో చిత్తు చేసింది.

రెండో టెస్ట్‌ హీరో జానీ బెయిర్‌స్టో మరోసారి చెలరేగాడు. టీ ట్వంటీ తరహాలో ఆడిన అతడు కేవలం 44 బంతుల్లోనే 71 రన్స్‌ చేయడంతో ఇంగ్లండ్‌ కేవలం 3 వికెట్లు కోల్పోయి 296 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా చేదించింది. బెయిర్‌స్టో సిక్స్‌తో తనదైన స్టైల్లో మ్యాచ్‌ ముగించాడు.
ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ 86 పరుగులతో రాణించాడు. 2021 జనవరి తర్వాత ఇంగ్లండ్‌ గెలిచిన తొలి టెస్ట్‌ సిరీస్‌ ఇదే. గతేడాది నుంచి ఇంగ్లీష్ టీమ్ కు వరుస పరాభవాలే ఎదురయ్యాయి. భారత్ , న్యూజిలాండ్‌ , ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల చేతుల్లో ఓడిపోయింది. అయితే కెప్టెన్ గా రూట్‌ తప్పుకుని బెన్‌ స్టోక్స్‌ పగ్గాలు అందుకున్న తర్వాత ఇంగ్లండ్‌ ఆటతీరే మారిపోయింది.
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ అద్బుతంగా ఆడింది.

దాదాపు ప్రతీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ బెయిర్ స్టో, స్టోక్స్ అదరగొట్టి భారీ స్కోర్లు ఆందించారు. రూట్‌ బాధ్యతాయుత ఆటకుతోడు బెయిర్‌స్టో విధ్వంసం వరల్డ్ ఛాంపియన్స్‌ న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మూడో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు తీసిన జాక్‌ లీచ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్‌ విజయంతో ఊపు మీద ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించడం ఇపుడు భారత్ కు పెద్ద సవాల్. ఈ మ్యాచ్ ను డ్రా చేసుకున్నా కూడా టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం కైవసం చేసుకుంటుంది.