Site icon HashtagU Telugu

Afghanistan Win: వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్

Afghan

Afghan

Afghanistan Win:  వన్‌సైడ్‌గా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్‌కు ఆప్ఘనిస్థాన్ షాకిచ్చింది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఇంగ్లీష్ టీమ్‌ను ఓడించింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గనిస్తాన్‌ 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గుర్బాజ్ 80 , వికెట్ కీపర్ ఇక్రమ్‌ 58 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. కివీస్‌పై, బంగ్లాదేశ్‌పై ఆకట్టుకున్న ఇంగ్లీష్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గుర్బాజ్‌ పలు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇబ్రహీమ్ నెమ్మదిగా ఆడినా గుర్బాజ్ బౌండరీలతో చెలరేగాడు. దీంతో పవర్ ప్లేలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది.

గుర్బాజ్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 114 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఆదిల్ రషీద్ విడదీశాడు. తర్వాత మిడిలార్డర్‌లో పలువురు వెంటవెంటనే ఔటవడంతో ఆప్ఘన్‌ 174 రన్స్‌కు 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా ఇక్రమ్ అలిఖిల్ పరుగులు రాబట్టాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో కలిసి 8వ వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. ఇక్రామ్ 58 పరుగులకు ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు, మార్క్ వుడ్ 2 , లివింగ్ స్టోన్ , రూట్ , టాప్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ ఆరంభం నుంచే తడబడింది.హ్యారీ బ్రూక్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. డేవిడ్ మలాన్ 32 పరుగులు చేయగా.. బెయిర్ స్టో , రూట్ , బట్లర్ , లివింగ్ స్టోన్ నిరాశపరిచారు. బ్రూక్ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. స్పిన్ పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న ఆప్ఘనిస్తాన్ కీలక సమయంలో అదరగొట్టింది. వరుసగా వికెట్లు తీస్తూ ఆప్ఘన్ స్పిన్నర్లు ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. బ్రూక్‌ పోరాడుతున్నా… మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడం ఇంగ్లాండ్ ఓటమికి కారణమైంది.

స్పిన్ ఆడడంలో తమ బలహీనతను ఇంగ్లీష్ బ్యాటర్లు మరోసారి బయటపెట్టుకున్నారు. చివర్లో రషీద్ 20 , మార్క్ వుడ్ 18 , టాప్లీ 15 రన్స్‌తో ధాటిగా ఆడే ప్రయత్నించినా ఓటమి తప్పలేదు. బ్రూక్ 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 66 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆప్ఘన్ బౌలర్లలో ముజీబుర్ రహమాన్ 3 , రషీద్ ఖాన్ 3 , నబీ 2 , ఫరూఖీ , నవీనుల్‌ హక్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇది రెండో ఓటమి. మరోవైపు మూడు మ్యాచ్‌లలో ఆఫ్గనిస్తాన్‌కు ఇదే మొదటి విజయం. అలాగే ఇంగ్లాండ్‌పై వన్డేల్లో గెలవడం కూడా ఆప్ఘన్‌కు ఇదే తొలిసారి.