Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. చాలా రోజుల క్రితమే జాతీయ జట్టుకు దూరమైన భువనేశ్వర్ ఇప్పుడు రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న రంజీ సీజన్ కోసం యూపీ జట్టును ప్రకటించగా… అందులో భువికి చోటు దక్కలేదు. దీంతో దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి మళ్ళీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్న భువీ ఆశలకు తెరపడినట్టేనని భావిస్తున్నారు. జహీర్ ఖాన్ తర్వాత భారత పేస్ బౌలింగ్ లో భువీ కీలక బౌలర్ గా ఎదిగాడు. భువనేశ్వర్ కుమార్ బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. 2018లో తన చివరి టెస్టు మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ దక్షిణాఫ్రికాపై జోహన్నెస్‌బర్గ్‌లో 63 పరుగులు చేసి 4 కీలక వికెట్లు కూడా తీశాడు.
అయితే ఈ యూపీ పేసర్ గత కొంతకాలంగా తన సహజశైలి బౌలింగ్ ను కోల్పోయాడు. మొదట్లో అద్భుతమైన పేస్ తో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీసిన భువి స్పీడ్ కూడా తగ్గిపోయింది. 2022 టీ20 ప్రపంచకప్ , ఆసియా కప్ లో భారత్ ఓటమికి భువనేశ్వర్ కారణమని చాలా మంది చెబుతుంటారు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చి జట్టుకు దూరమయ్యాడు. దీనికి తోడు గత రెండేళ్ళుగా పలువురు యువపేసర్లు జట్టులోకి వచ్చేశారు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లు టీమ్ ఇండియాలో కీలకంగా మారిపోయాడు. దీనికి తోడు షమీ కూడా ఉండడంతో సెలక్టర్లు భువీని పట్టించుకోవడం లేదు. భువనేశ్వర్ తన చివరి వన్డేను 2022 జనవరిలో దక్షిణాఫ్రికాపై ఆడాడు.
Also Read: Narottam Mishra : మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సిందే
ప్రస్తుతం ఐపీఎల్ , దేశవాళీ టీ ట్వంటీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్న భువి చివరిసారిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భువనేశ్వర్ ఇప్పటి వరకూ 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ ట్వంటీలు ఆడాడు. టెస్టుల్లో 63 , వన్డేల్లో 141 , టీ ట్వంటీల్లో 90 వికెట్లు పడగొట్టిన భువీ ఐపీఎల్ లో 176 మ్యాచ్ లు ఆడి 181 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 231 వికెట్లు తీసిన భువనేశ్వర్ కు ఇప్పుడు రంజీ జట్టులో కూడా చోటు లేకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటన మాత్రమే మిగిలిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.