IPL 2026 ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదలలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే వరకు వేచి చూడాలని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్స్ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఈ ఆలస్యానికి మరో కారణంగా తెలుస్తోంది.
- ఎన్నికల తేదీలు ఖరారయ్యాకే షెడ్యూల్ ప్రకటిస్తామన్న బీసీసీఐ
- రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలలో జాప్యం
- ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్స్‌పై వీడని సందిగ్ధత
- వారం రోజుల్లో వేదికలు ఖరారు చేయాలని ఫ్రాంచైజీలకు ఆదేశం
ఆర్‌సీబీ, ఆర్‌ఆర్ ఫ్రాంచైజీల హోం గ్రౌండ్స్‌పై గందరగోళం
మరోవైపు ఆర్‌సీబీ, ఆర్‌ఆర్ ఫ్రాంచైజీల హోం గ్రౌండ్స్‌పై నెలకొన్న గందరగోళం కూడా షెడ్యూల్‌పై ప్రభావం చూపుతోంది. గతేడాది ఐపీఎల్ 2025 విజయోత్సవాల సమయంలో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడంతో అక్కడ మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు. ఇటీవల కొన్ని షరతులతో కూడిన అనుమతులు లభించినప్పటికీ, ఆర్‌సీబీ తమ హోం మ్యాచ్‌లన్నీ బెంగళూరులోనే ఆడుతుందా? లేక కొన్ని మ్యాచ్‌లను రాయ్‌పూర్‌కు తరలిస్తుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇక, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ)లో నెలకొన్న పరిపాలనా సమస్యల కారణంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం లభ్యతపై సందేహాలున్నాయి. ఈ క్రమంలో పుణే వంటి బ్యాకప్ వేదికను సిద్ధం చేసుకోవాలని బీసీసీఐ ఇప్పటికే రాజస్థాన్ ఫ్రాంచైజీకి సూచించింది. ఈ రెండు ఫ్రాంచైజీలు తమ హోం వేదికలను వారం రోజుల్లో ఖరారు చేయాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ రెండు అంశాలు తేలిన తర్వాతే ఐపీఎల్-2026 పూర్తి షెడ్యూల్‌పై స్పష్టత రానుంది.
