Site icon HashtagU Telugu

IPL: చరిత్ర సృష్టించిన బ్రావో

67

67

ఐపీఎల్ అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్… ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్‌లోనూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా చెన్నై సూపప్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగా పేరిట ఉంది. మలింగ తన ఐపీఎల్ కెరీర్‌లో 170 వికెట్లు పడగొట్టగా.. బ్రావో గత మ్యాచ్‌లోనే ఆ రికార్డును సమం చేశాడు. అయితే లక్నోతో మ్యాచ్‌లో మరో వికెట్ తీయడం ద్వారా మలింగ రికార్డును బ్రావో బ్రేక్ చేశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల జాబితాకు సంబంధించి బ్రావో, మలింగ తర్వాత అమిత్‌ మిశ్రా 166, పియూష్ చావ్లా 157 , హర్భజన్‌సింగ్ 150 , రవిచంద్రన్ అశ్విన్ 145 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సుదీర్ఘ కాలంగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న బ్రావో 153 మ్యాచ్‌లలో 8.33 ఎకానమీతో 171 వికెట్లు తీసాడు. 4 వికెట్ల ప్రదర్శన రెండుసార్లు కనబరిచిన బ్రేవో అత్యుత్తమ గణంకాలు 22 పరుగులకు 4 వికెట్లుగా ఉంది. గత సీజన్‌లోనూ బ్రావో నిలకడగా రాణించాడు. 11 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టి చెన్నై టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే వేలంలో మళ్ళీ బ్రావోను సిఎస్‌కే 4.4 కోట్లకు కొనుగోలు చేసింది.

కాగా ఈ రికార్డును మలింగ 122 మ్యాచ్‌లలో అందుకుంటే… బ్రావో 153 మ్యాచ్‌లలో అందుకున్నాడు. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌ నుంచి వరుసగా మూడు సీజన్లు ముంబై ఇండియన్స్‌కు ఆడిన బ్రావోను 2011 వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్ కొనుగోలు చేసింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ పలు సీజన్లలో అద్భుతంగా రాణించిన బ్రేవో ఈ సీజన్‌లోనూ చెన్నైకి కీలకం కానున్నాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.