Shivam Dube న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ – 20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దుబే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, 23 బంతుల్లో 65 పరుగులు సాధించి రికార్డులు సృష్టించాడు. దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగిన దుబే, భారత్ ఓటమిని ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 215 పరుగులు చేయగా.. భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయింది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దుబే సిక్సర్ల మోతతో వైజాగ్ స్టేడియం హోరెత్తింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో దుబే ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. కివీస్ అందించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పోరాటం మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే చేసిన విధ్వంసకర ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది.
న్యూజిలాండ్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆరంభం ఘోరంగా మారింది. తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌట్ కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ ఒత్తిడిలో పడింది. సంజూ శాంసన్ వేగంగా పరుగులు సాధించినా, ఆ ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. హార్దిక్ పాండ్యా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చిన శివమ్ దూబే మ్యాచ్ స్వరూపాన్నే మార్చే ప్రయత్నం చేశాడు. తొలి బంతి నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన దూబే, కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఘనతతో భారత్ తరఫున మూడో వేగవంతమైన టీ20 అర్ధశతకం సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ (12 బంతులు), అభిషేక్ శర్మ (14 బంతులు) తర్వాతి స్థానంలో దూబే నిలిచాడు.
ముఖ్యంగా లాంగ్ ఆన్, మిడ్‌వికెట్ మధ్యలో భారీ షాట్లతో స్టేడియాన్ని ఊపేశాడు. అతని బ్యాటింగ్ చూస్తే మ్యాచ్ భారత్ వైపు తిరుగుతుందనే ఆశ కలిగింది. అయితే దురదృష్టవశాత్తు 23 బంతుల్లో 65 పరుగులు చేసిన దూబే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి మ్యాట్ హెన్రీ చేతిని తాకి స్టంప్స్‌ను తాకడంతో క్రీజ్‌కు బయట ఉన్న దూబే ఔట్ అయ్యాడు.
దూబే అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలింది. రింకూ సింగ్ కొంత పోరాడినా, అవసరమైన రన్‌రేట్‌ను అందుకోలేకపోయారు. చివరికి భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయి, 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో దూబే 282.60 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. కనీసం 50 పరుగులు చేసిన భారత బ్యాటర్లలో ఇది మూడో అత్యధిక స్ట్రైక్‌రేట్‌గా నమోదైంది. యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ తర్వాతి స్థానంలో ఇప్పుడు శివమ్ దూబే పేరు నిలిచింది.
3 ఓవర్లలో 17 రన్స్.. ఒకే ఓవర్లో 29 పరుగులు..
ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. దీంతో భారత్ చిత్తుగా ఓడటం ఖాయమని భావించారంతా. కానీ భారత సంతతికి చెందిన ఇష్ సోధీ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో దూబే ఆట శివ తాండవాన్ని తలపించింది. తొలి బంతికి రెండు పరుగులు తీసిన దూబే.. మరుసటి బంతికి 4 బాదాడు. దీంతో మూడో బంతిని సోధీ వైడ్ వేయగా.. ఆ తర్వాత దూబే వరుసగా 6 4 6 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి.
ఆ దెబ్బతో మళ్లీ దూబే ఔటయ్యాక గానీ.. కివీస్ కెప్టెన్ సోధీతో బౌలింగ్ వేయించలేదు. ఈ ఓవర్ కంటే ముందు రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన సోధీ.. 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే ఇన్నింగ్స్ 17వ ఓవర్ బౌలింగ్ చేసిన సోధీ.. 2 వికెట్లు తీసి 5 రన్స్ ఇచ్చాడు. అంటే మూడు ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్న ఇష్.. దూబే దెబ్బకు ఒకే ఓవర్లో 29 పరుగులు సమర్పించుకున్నాడు.
