IND vs SA 2022 : సఫారీతో సిరీస్‌కు ద్రావిడే కోచ్‌

సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ ట్వంటీల సిరీస్‌కు టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడే వ్యవహరించనున్నాడు.

  • Written By:
  • Publish Date - June 2, 2022 / 04:46 PM IST

సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ ట్వంటీల సిరీస్‌కు టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడే వ్యవహరించనున్నాడు. పూర్తి సిరీస్‌కు ద్రావిడ్ అందుబాటులో ఉంటాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ముందుగా వచ్చిన కొన్ని వార్తల ప్రకారం ద్రావిడ్ టెస్ట్ జట్టుతో ఇంగ్లాండ్‌కు ముందే వెళ్ళనున్నాడని, ఈ కారణంగా సఫారీలతో సిరీస్‌కు అందుబాటులో ఉండడని భావించారు. ద్రావిడ్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు పెద్ద జట్లతో జరగనున్న అన్ని సిరీస్‌లకు ద్రావిడ్ జట్టుతో పాటే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌ కోసం ద్రవిడ్ కొందరు సీనియర్ ప్లేయర్స్‌తో ముందే వెళతాడని భావించగా.. ఇప్పుడు జూన్ 20న యూకేకు బయలుదేరతాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు యువక్రికెటర్లతో కూడిన మరో జట్టుతో కలిసి ఐర్లాండ్ సిరీస్ కోసం వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. కాగా సౌతాఫ్రికాతో జరగనున్న సిరీస్ కోసం కోహ్లీ, రోహిత్‌శర్మ, బుమ్రా, షమీ వంటి సీనియర్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే పలువురు యువక్రికెటర్లు గాయాల నుంచి కోలుకుంటుండగా.. ద్రావిడ్ పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది. కెఎల్ రాహుల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా భావిస్తున్న నేపథ్యంలో ద్రావిడ్ మార్గనిర్దేశకత్వం ఉంటేనే మంచిదన్న అభిప్రాయం కూడా వినిపించడంతో ది వాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా ఐర్లాండ్ టూర్‌కు వెళ్ళే జట్టు బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న టెస్ట్ సమయంలో ద్రావిడ్ టీమ్‌తో కలుస్తుందని బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు టీ ట్వంటీలు , మూడు వన్డేలు ఆడనుంది. గత ఏడాది కరోనా కారణంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆగిపోయిన ఏకైక మ్యాచ్‌ను ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.