Site icon HashtagU Telugu

Ind Vs Aus Warm Up: ఆసీస్ తో వార్మప్ మ్యాచ్.. తుది జట్టుపై క్లారిటీ వస్తుందా ?

Team India T20

Team India T20

టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్ లకు ఇంకా వారం రోజులు సమయముంది. ఈ లోగా పలు జట్లు వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నాయి. తద్వారా ప్రాక్టీస్ తో పాటు తమ తుది జట్టుపైనా కసరత్తు ఫైనలైజ్ చేయనున్నాయి. సోమవారం టీిమిండియా, ఆస్ట్రేలియాతో తలపడనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఆసీస్ పై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బరిలోకి దిగడం ఖాయమైంది.

బూమ్రా గాయంతో దూరమైన నేపథ్యంలో రీప్లేస్ మెంట్ గా ఎంపికైన షమీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ లే ప్రాక్టీస్ కు మిగిలిన చివరి రెండు అవకాశాలు. ఎందుకంటే ఈ ఏడాది ఒక్క టీ ట్వంటీ కూడా ఆడని షమీ మెగా టోర్నీలో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్ పిచ్ లకు షమీ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని అంచనా ఉన్న నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ లలో ప్రాక్టీస్ ఖచ్చితంగా అతనికి ఉపయోగపడేదే. మరో పేసర్ హర్షల్ పటేల్ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది.

ఐపీఎల్ లో అదరగొట్టి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న హర్షల్ ఆరంభంలో రాణించినా తర్వాత ఫామ్ కోల్పోయాడు. దీంతో ఈ రెండు వార్మప్ మ్యాచ్ లతో రిథమ్ అందుకోకుంటే భారత్ కు కష్టమే. అటు స్పిన్ విభాగంలో చాహల్, అశ్విన్ లలో ఎవరికి చోటు దక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ కోటాలో తన ప్లేస్ ఖాయం చేసుకోగా.. మరో స్పిన్నర్ గా సీనియర్ అశ్విన్ కే చోటు కల్పిస్తారా.. లేక చాహల్ ను తీసుకోవాలా అనేది టీమిండియాకు సవాల్ గా మారింది. మరోవైపు బ్యాటింగ్ పరంగా పెద్ద ఇబ్బందులు లేకున్నా.. మెగా టోర్నీకి ముందు ఆసీస్ పిచ్ లపై తమ జోరు కొనసాగించడం ప్రధాన బ్యాటర్లకు అవసరమే. పైగా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో గెలిచిన భారత్ రెండో మ్యాచ్ లో నిరాశపరిచింది. దీనికి కారణం ప్రధాన బ్యాటర్లు రాణించకపోవడమే. అందుే పాక్ తో మ్యాచ్ కు ముందు మిగిలిన రెండు వార్మప్ మ్యాచ్ లలోనూ వారు సత్తా చాటాల్సిందే.

Exit mobile version