Site icon HashtagU Telugu

Asia Cup : ఆసియా కప్ కొత్త వేదిక ఎక్కడో తెలుసా ?

BCCI

BCCI

అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాకప్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. అయితే వేదిక మాత్రం మారింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాము టోర్నీ నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు సమాచారమిచ్చింది. నిజానికి గత కొన్ని వారాలుగా శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక సంక్షోభంతో ప్రజలంతా రోడ్లెక్కారు. దేశ అధ్యక్షుడే విదేశాలకు పరారయ్యాడు. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణపై ఆందోళన నెలకొంది.

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్ లు విజయవంతంగా జరగడంతో ఆసియాకప్ కూడా నిర్వహిస్తామని ముందు లంక బోర్డు చెప్పింది. అయితే తాజా పరిస్థితులతో వెనకడుగు వేయడంతో కొత్త వేదికగా యూఏఈని నిర్వాహకులు ఎంచుకున్నట్టు సమాచారం. తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. ఆసియా కప్ యూఏఈలో జరుగుతుందన్నాడు. వర్షాలు లేని ఏకైక ప్లేస్ అదేనని, అక్కడే నిర్వహించడమే బెటర్ అన్నాడు.

గతంలో ఏసీసీ అధికారులు శ్రీలంకలో సాధ్యం కాకుంటే బంగ్లాదేశ్‌ను స్టాండ్ బై‌ హోస్ట్ దేశంగా ప్రకటించినా ఇప్పుడు అక్కడ కూడా నిర్వహించడానికి అవకాశం లేదు. వర్షాకాలంలో బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహిస్తే దాదాపు సగం మ్యాచ్‌లు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదముంది. దీంతో టోర్నీని నిర్వహణ కోసం ఏసీసీ అధికారులు యూఏఈ క్రికెట్ బోర్డును సంప్రదించడం.. వారు సానుకూలంగా స్పందించడం జరిగిపోయాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ ఆగస్టు 27నుండి సెప్టెంబర్ 11వరకు జరగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో దీన్ని నిర్వహించనున్నారు.

Exit mobile version