భారత డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ డోపింగ్ ఉల్లంఘన కారణంగా మూడు సంవత్సరాల పాటు పోటీ నుండి నిషేధించినట్లు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (AIU) ప్రకటించింది. కమల్‌ప్రీత్ నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది.
ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా.. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్‌ప్రీత్ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్ తేలడంతో మార్చి 29న సస్పెన్షన్ వేటు వేశారు. ఆమె నమూనాలను స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లోని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షించారు. దీంతో కమల్‌ప్రీత్ భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. మార్చి 29, 2022 నుండి మూడు సంవత్సరాల పాటు ఈ నిషేధం అమలుకానుంది.