Site icon HashtagU Telugu

Dinesh Karthik: కలలు నిజంగానే నిజమవుతాయి..వైరల్‌గా డీకే ట్వీట్

Dinesh Karthik Kkr Imresizer

Dinesh Karthik Kkr Imresizer

సరిగ్గా ఏడాది క్రితం అతని కెరీర్ ముగిసిపోయిందన్నారు.. రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలిందన్నారు…ఇక జట్టులో చోటు కష్టమేనని తేల్చేశారు. కట్ చేస్తే ఐపీఎల్ 15వ సీజన్‌తో తన రీఎంట్రీకి బాటలు వేసుకున్నాడు…పట్టుదలగా రాణించి ఏ రోల్‌లో అయితే జట్టులో ఎంపిక చేస్తారో అదే రోల్‌లో సక్సెస్ అయ్యాడు.. అతనెవరో కాదు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. అసలు జట్టులో చోటే కష్టమనుకున్న వేళ మళ్ళీ అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అన్నింటికీ మించి టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ ఆడాలన్న తన లక్ష్యాన్ని కూడా అందుకున్నాడు.

ధోనీ హయాంలో అవకాశాలే రాక దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు దినేశ్ కార్తీక్.. ఎప్పుడైనా ధోనీ రెస్ట్ తీసుకున్నప్పుడో… గాయంతో తప్పుకున్నప్పుడో తప్ప అవకాశాలు అంతగా రాలేదు. పలు సందర్భాల్లో సత్తా చాటినా అవకాశాలు మాత్రం అంతంతే వచ్చాయి. దాదాపు 2020 తర్వాత జట్టులోకి వస్తూ పోతూ ఉన్న డీకే ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసినా ఫలితం లేకపోయింది. 36 ఏళ్ళ వయసులో ఇక రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ దశలో ఐపీఎల్ 15వ సీజన్ అతని కెరీర్‌కు మళ్ళీ ఊపు తెచ్చిందన్నది అంగీకరించాల్సిందే.

ఎందుకంటే జాతీయ జట్టులో ధోనీ తర్వాత భారత్‌కు సరైన ఫినిషర్ లేడన్నది తెలిసిందే. ఆస్థాయిలో కాకున్నా కనీసం ఫినిషర్ రోల్‌లో ఎవ్వరిపైనా అంచనాలు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను ఫినిషర్ రోల్‌గా తనను తాను మార్చుకున్నాడు. 14 మ్యాచ్‌లలలో 330కి పైగా పరుగులు చేయడంతో సెలక్టర్లు ఖచ్చితంగా తనని ఎంపిక చేసే పరిస్థితి కల్పించాడు. దీంతో లేటు వయసులో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన డీకే వరుసగా పలు సిరీస్‌లకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో మేనేజ్‌మెంట్ ఎక్కువగా రిషబ్ పంత్‌కే అవకాశాలు ఇవ్వడంతో ప్రపంచకప్‌కు డీకేకు చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక దశలో పంత్ వర్సెస్ డీకే అంటూ తీవ్ర చర్చ కూడా జరిగింది. ఫినిషర్ రోల్‌కు పంత్ కంటే డీకేనే బెటర్ అన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపించింది.

దీంతో సెలక్టర్లు వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్‌ కోసం ఇద్దరినీ ఎంపిక చేసారు. పరిస్థితిని బట్టి డీకేకు అవకాశాలిస్తారని భావిస్తున్నారు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో చోటు దక్కిన తర్వాత దినేశ్ కార్తీక్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కలలు నిజంగానే నిజమవుతాయి అంటూ ట్వీట్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ ట్వీట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. కంగ్రాట్స్ డీకే… ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెబుతున్నారు. అయితే వరల్డ్‌కప్‌కు ఎంపికవడమే కాదు ఫినిషర్ రోల్‌లో జట్టుకు విజయాలను అందించడమే డీకే తర్వాతి టార్గెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా డీకే రీఎంట్రీ యువ ఆటగాళ్ళకు చక్కని స్ఫూర్తి అనడంలో డౌటే లేదు.. కలలు నిజంగానే నిజమవుతాయి..