Dinesh Karthik : మళ్లీ టీమ్ ఇండియా లోకి వస్తా

ప్రస్తుతం భారత జట్టుకు సరైన ఫినిషర్ లేడు.ధోని తర్వాత టీమ్ ఇండియా ఫినిషర్ పాత్రలో హార్దిక్ పాండ్యా సరిపోతాడని అంతా భావించారు.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:48 PM IST

ప్రస్తుతం భారత జట్టుకు సరైన ఫినిషర్ లేడు.ధోని తర్వాత టీమ్ ఇండియా ఫినిషర్ పాత్రలో హార్దిక్ పాండ్యా సరిపోతాడని అంతా భావించారు. అయితే ఫిట్‌నెస్ లేమితో హార్దిక జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో ఫినిషర్ కోసం భారత్ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈ స్థానానికి తగినవాడు అంటూ కొందరు చెబుతున్నారు. కార్తీక్ 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టు తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతను జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ లో అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్ లు ఆడినా యువ ఆటగాళ్ల వైపే సెలక్టర్లు మొగ్గు చూపడంతో కార్తీక్‌ను జట్టులోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు టీమిండియాలోకి తిరిగి వస్తానని కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ భారత జట్టు కోసం ఆడాలనుకుంటున్నాననీ, దాని కోసం సాధ్యమైనదంతా చేస్తాననీ చెప్పాడు.

తాను ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని సాధించడానికి శిక్షణ, సాధన చేస్తున్నట్టు వెల్లడించాడు. రాబోయే మూడేళ్లలో ఇంకా మెరుగైన ఆడాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు ఆడే సత్తా తనలో ఇంకా ఉందని కార్తీక్ చెప్పాడు. గత టీ20 ప్రపంచకప్‌లో ప్రధాన సమస్య ఫినిషర్ గా చెప్పిన కార్తిక్ తాను ఆ పాత్రపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పాడు. దినేష్ కార్తీక్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫు ఆడుతున్నాడు. అయితే ఈసారి అతనిని కోల్ కత్తా రిటైన్ చేయలేదు. ఇటీవల ఇంగ్లాండ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కార్తీక్ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. కార్తీక్ భారత్ తరఫున ఇప్పటివరకు 26 టెస్టులు 94 వన్డేలు ఆడాడు.