Site icon HashtagU Telugu

Dinesh Karthik Retirement: డీకే రిటైర్మెంట్ హింట్..?

Dinesh Karthik Retirement

Dinesh Karthik Retirement

టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా.. డీకే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్
చేసిన వీడియోతో ఇప్పుడు అభిమానులకు ఇదే డౌట్ వస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. టీమిండియా తరపున టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు.. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ డీకే ఉద్వేగపూరిత క్యాప్షన్‌ జతచేశాడు. ఈ వీడియో చూసిన చాలా మంది దినేశ్ కార్తీక్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున అదరగొట్టిన కార్తీక్‌.. ఫినిషర్‌గా భారత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంచనాలకు తగ్గట్టు రాణించడంలో డీకే విఫలమయ్యాడు. కీలక మ్యాచ్‌లలో పంత్‌ను కాదని అవకాశం ఇచ్చినప్పటికీ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా భారత్‌ ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపద్యంలో కార్తీక్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే డీకే ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడని భావిస్తున్నారు. 37 ఏళ్ల దినేశ్ కార్తీక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకూ 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ ట్వంటీలు ఆడాడు.