IPL: రిటెన్షన్‌లో ధర తగ్గిన ధోనీ,కోహ్లీ

  • Written By:
  • Updated On - February 15, 2022 / 07:27 PM IST

ఐపీఎల్ మెగా వేలంలో కొందరు అనూహ్య ధర పలికితే… మరికొందరు గతంతో పోలిస్తే తక్కువ రేటుకే అమ్ముడయ్యారు. అటు పలువురు స్టార్ క్రికెటర్లకు ఫ్రాంచైజీలు షాకిస్తే.. యువ ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. ప్రస్తుతం అన్ని జట్లూ తమ కూర్పును సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ఆటగాళ్ళలో ఎవరికి ఎంత దక్కిందన్న దానిపై చర్చ మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే రిటెన్షన్ ఆటగాళ్లకు సంబంధించి ధోనీ, కోహ్లీ, మాక్స్‌వెల్‌లకు ధర తగ్గింది. భారత క్రికెట్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న ధోనీ ఐపీఎల్‌కు కూడా త్వరలోనే దూరమయ్యే అవకాశముండడం అతనికి ఇవ్వాల్సిన మొత్తంపై సహజంగానే ప్రభావం చూపింది. గత సీజన్ వరకూ 15 కోట్లు అందుకున్న ధోనీకి ఈ సారి 12 కోట్లే దక్కనుంది. ఇదిలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ధర కూడా తగ్గిపోయింది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోవడం, భారత క్రికెట్‌లో అన్ని ఫార్మేట్ల కెప్టెన్సీ నుండి తప్పుకోవడం కోహ్లీ రిటెన్షన్ ధరపై ప్రభావం చూపించింది. నిజానికి కోహ్లీ గత సీజన్‌తోనే ఆర్సీబీ సారథిగా వైదొలిగాడు. గత సీజన్ వరకూ 17 కోట్లు అందుకున్న కోహ్లీకి 2 కోట్లు కోల్పోయి 15 కోట్లే లభించనుంది. ప్రస్తుతం రిటెన్షన్‌కు సంబంధించి భారత క్రికెటర్లలో ధోనీ, కోహ్లీకి మాత్రమే ధర తగ్గింది. అటు విదేశీ ఆటగాళ్ళ రిటెన్షన్‌కు సంబంధించి గ్లెన్ మాక్స్‌వెల్‌ గతంతో పోలిస్తే 3.25 కోల్పోయాడు. ఈ సీజన్ నుండి మాక్స్‌వెల్‌ 11 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు.

మరోవైపు రిటెన్షన్ ఆటగాళ్ళ జాబితాలో బాగా లాభం పొందిన ఆటగాళ్ళలో రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్ , రిషబ్ పంత్, పృథ్వీషా, సంజూ శాంసన్ శుభ్‌మన్ గిల్ ఉన్నారు. భారత ఆటగాళ్ళలో మయాంక్ అగర్వాల్‌ ధర గతంతో పోలిస్తే 11 రెట్లు పెరిగింది. గత సీజన్ వరకూ 1 కోటికే పరిమితమైన మయాంక్‌ను పంజాబ్ 11 కోట్లతో రిటైన్ చేసుకుంది. అలాగే చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్రజడేజా రిటెన్షన్‌లో అతని ధర 9 రెట్లు పెరిగింది. గత సీజన్ వరకూ 7 కోట్లు తీసుకున్న జడేజాను చెన్నై మొదటి ప్రాధాన్యతగా 16 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. అలాగే చెన్నై యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ కూడా రిటెన్షన్‌లో జాక్‌పాట్ కొట్టాడు. గతంలో 20 లక్షలకే అతన్ని సొంతం చేసుకున్న చెన్నై ఈ సారి 6 కోట్లతో రిటైన్ చేసుకుంది. ముంబై జట్టులో కెప్టెన్ రోహిత్‌శర్మతో పాటు బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, పొల్లార్డ్ కూడా రిటెన్షన్‌లో లాభపడ్డారు. అటు కోల్‌కతా జట్టులో ఆండ్రూ రస్సెల్ 7 కోట్లు తీసుకోగా.. రిటెన్షన్‌తో అతని జీతం 12 కోట్లు అయింది. అలాగే వెంకటేష్ అయ్యర్ 20 లక్షల బేస్ ప్రైస్‌తో అడుగుపెట్టగా.. ఈ సారి రిటెన్షన్‌తో అతని వాల్యూ 7.8 రెట్లు పెరిగి 8 కోట్లకు చేరింది.

ఇక విదేశీ ఆటగాళ్ళలో బాగా లాభం పొందించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్‌. గత సీజన్ వరకూ 3 కోట్లు తీసుకున్న విలియమ్సన్‌ కోసం సన్‌రైజర్స్ 11 రెట్లు వెచ్చించింది. ఈ సీజన్ నుండి కేన్ మామ 14 కోట్లు అందుకోనున్నాడు. అలాగే గుజరాత్ టైటాన్స్ తీసుకున్న హార్థిక్ పాండ్యా వాల్యూ 4 రెట్లు, రషీద్‌ఖాన్ వాల్యూ 6 రెట్లు పెరిగింది. అటు లక్నో సూపర్‌జెయింట్స్ కేఎల్ రాహుల్‌ను 5 రెట్లు ఎక్కువగా వెచ్చించి 16 కోట్లకు తీసుకుంటే.. రవి బిష్ణోయ్ కోసం 2 రెట్లు ఎక్కువగానూ, స్టోయినిస్‌ కోసం 4.4 రెట్లు ఎక్కువగానూ వెచ్చించింది. మొత్తం మీద రిటెన్షన్‌లో ధోనీ, కోహ్లీ, మాక్స్‌వెల్‌ మాత్రమే నష్టపోగా.. మిగిలిన వారంతా బాగానే లాభపడ్డారు.