Site icon HashtagU Telugu

MS Dhoni @200 Caps: ధోనీ ఖాతాలో మరో రికార్డు

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni @200 Caps: ప్రపంచ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు ధోనీ కారణంగానే విపరీతమైన క్రేజ్. హోంటౌన్ కాకున్నా ధోనీని తమ సొంత మనిషిలా ఆరాధిస్తారు చెన్నై ఫ్యాన్స్. ఇప్పటికే ఎన్నో రికార్డులు అందుకున్న మహి తాజాగా మరో మైలురాయి తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై టీమ్ కు 200 మ్యాచ్ లు సారథిగా వ్యవహరించిన ఘనత సాధించాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ 146 మ్యాచ్ లతో రెండోస్థానంలో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్ కు ముందు ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఘనంగా సన్మానించింది. ఆ టీమ్ ఓనర్ శ్రీనివాసన్.. ధోనీకి స్పెషల్ మెమొంటోను అందించి సత్కరించారు. ఇలాంటి అరుదైన ఘనతను సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో అందుకోవడంతో ధోనీ ఫ్యాన్స్ ఉత్సాహానికి హద్దే లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే టాస్ సందర్భంగా ఈ మ్యాచ్ గురించి మిస్టర్ కూల్ సరదా కామెంట్స్ కూడా చేశాడు. చెపాక్ స్టేడియంలో చాలా వేడిగా ఉందని, అయితే తనకు మాత్రం ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఆడుతున్నట్లుందని ధోనీ వ్యాఖ్యానించాడు. సారథిగా 200వ మ్యాచ్ ఆడుతుండటం చాలా సంతోషంగా ఉందనీ, ఇక్కడ ప్రేక్షకుల మద్దతు అద్భుతమన్నాడు. ఇక క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయనీ, అయితే అప్పటికి ఇప్పటి టీ20 మ్యాచ్‌లకు చాలా తేడా ఉందన్నాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 238 మ్యాచ్ లు ఆడిన ధోనీ 5 వేలకు పైగా పరుగులు చేశాడు. వీటిలో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సారథిగా చెన్నై సూపర్ కింగ్స్ ను 4 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు.