Australia Tour In India: హైదరాబాద్‌లో మరో క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడంటే..?

మూడేళ్ల విరామం తర్వాత భారత్- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ మరోసారి వేదికగా మారబోతోంది.

  • Written By:
  • Updated On - November 17, 2022 / 11:35 AM IST

మూడేళ్ల విరామం తర్వాత భారత్- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ మరోసారి వేదికగా మారబోతోంది. ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌ను కూడా LB స్టేడియంలో నిర్వహించేందుకు BCCI యోచిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్యలో ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది.

వచ్చే ఏడాది ప్రారంభం ఫిబ్రవరి-మార్చిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు వచ్చినప్పుడు ఢిల్లీ ఓ టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. మిగతా టెస్టులు అహ్మదాబాద్, ధర్మశాల, చెన్నై, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో జరిగే అవకాశం ఉంది.నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో రెండవ మ్యాచ్‌కు ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందని BCCI అధికారి ఒకరు తెలిపారు. టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించే సమయానికి తేదీలు వెలువడతాయి. దాదాపు ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో 2017 మార్చిలో మొదటి, ఏకైక టెస్టును నిర్వహించిన ధర్మశాల మూడో టెస్టుకు ఆతిథ్యం ఇస్తుందని ఆయన తెలిపారు.

తొలి టెస్టుకు చెన్నై లేదా నాగ్‌పూర్ లేదా హైదరాబాద్, చివరి టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని తెలిపారు. టెస్టుల్లో ఒకటి డే అండ్ నైటర్‌ మ్యాచ్ ఉంటుందని సమాచారం. BCCI ఇప్పటివరకు మూడు డే-నైట్ టెస్ట్‌లను పింక్ బాల్‌తో ఆడింది. 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై, 2021లో అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌పై.. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో శ్రీలంకపై ఆడింది. వచ్చే ఏడాది జూన్‌లో లండన్‌లోని ఓవల్‌లో జరిగే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా, టీమిండియా రెండింటికీ ఇవి చివరి టెస్ట్ మ్యాచ్‌లు. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 70 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (60), శ్రీలంక (53.33), ఆ తర్వాత భారత్ (52.08) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.