WPL: బెంగుళూరుపై ఢిల్లీ ఘన విజయం

మహిళల ఐపీఎల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది. బ్యాటింగ్ లో షఫాలీ వర్మ, బౌలింగ్ లో తారా నోరిస్‌ అదరగొట్టారు.

  • Written By:
  • Publish Date - March 5, 2023 / 10:59 PM IST

WPL RCB Vs DC: మహిళల ఐపీఎల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది. బ్యాటింగ్ లో షఫాలీ వర్మ, బౌలింగ్ లో తారా నోరిస్‌ అదరగొట్టారు. దీంతో ఢిల్లీ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్ లో షఫాలీ వర్మ, మెగ్‌ లాన్నింగ్‌ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. ఆకాశమే హద్దుగా వీరిద్దరూ రెచ్చిపోయారు. ఆర్సీబీ బౌలర్లను ఓ ఆటాడుకున్న ఈ జోడీ భారీ షాట్లతో అలరించింది. షఫాలీ వర్మ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84, మెగ్‌ లాన్నింగ్‌ 43 బంతుల్లో 14 ఫోర్లుతో 72 రన్స్ చేశారు. తర్వాత మారిజాన్‌ కాప్‌ 17 బంతుల్లో 39 నాటౌట్‌ , జెమీమా రోడ్రిగెస్‌ 15 బంతుల్లో 22 నాటౌట్ చెలరేగి ఆడారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. షఫాలీ, లాన్నింగ్‌లను హీథర్‌ నైట్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపడంతో స్కోర్‌ వేగం తగ్గింది.

224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ, డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. అయితే 5వ ఓవర్లో సోఫీ డివైన్‌ను షఫాలీ వర్మ అద్భుతమైన డైవిండ్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. ఇక్కడ నుంచీ బెంగుళూరు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. డీసీ పేసర్‌ తారా నోరిస్‌ వరుస ఓవర్లలో 4 వికెట్లు నేలకూల్చి ఆర్సీబీ ఓటమిని దాదాపుగా ఖరారు చేసింది. 11వ ఓవర్‌లో ఎల్లీస్‌ పెర్రీ, దిషా కసత్‌లను ఔట్‌ చేసిన నోరిస్‌.. 13వ ఓవర్‌లో వరుస బంతుల్లో రిచా ఘోష్‌ , కనిక అహుజాలను పెవిలియన్‌కు పంపింది. దీంతో
ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసింది. కాగా మహిళల ఐపీఎల్ లో
తొలి ఐదు వికెట్ల ఘనత నమోదైంది. డీసీ పేసర్‌ తారా నోరిస్‌ ఈ ఫీట్‌ను సాధించి రికార్డుల్లోకెక్కింది.4 ఓవర్లు బౌల్‌ చేసిన తారా.. 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.