Delhi Capitals : హోంగ్రౌండ్‌లో అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి

Delhi Capitals : ఐపీఎల్ సెకండాఫ్‌ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసు ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది.

Published By: HashtagU Telugu Desk
Delhi Capitals

Delhi Capitals

Delhi Capitals : ఐపీఎల్ సెకండాఫ్‌ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసు ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది. ఈ సీజన్‌లోనే పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ వెనుకబడి మ్యాచ్ గెలిచింది. సొంతగడ్డపై టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు(Delhi Capitals)  ఓపెనర్లు ఫ్రేజర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. ఫ్రేజర్ మరోసారి మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. రాజస్థాన్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత హోప్ , అక్షర్ పటేల్, పంత్ నిరాశపరిచినా… అభిషేక్ పోరల్, స్టబ్స్‌ కీలక పార్టనర్‌షిప్‌తో ఢిల్లీ భారీస్కోర్ సాధించింది. పోరల్ కేవలం 36 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేయగా… స్టబ్స్ 20 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా.. మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

222 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. ఆరభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్ 4 , బట్లర్ 19 పరుగులకే ఔటవగా.. ఈ దశలో సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్‌, శుభమ్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఫామ్‌ కొనసాగించిన ఈ కేరళ వికెట్ కీపర్ కప్ బ్యాటర్ కేవలం 46 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. అయితే బౌండరీ లైన్ దగ్గర హోప్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. సంజూ క్రీజులో ఉన్నంతసేపూ రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అలాగే హోప్ బౌండరీ లైన్ తొక్కాడని సంజూ శాంసన్ అంపైర్లతో కాసేపు వాగ్వాదం పెట్టుకున్నప్పటకీ…థర్డ్ అంపైర్ పదేపదే వీడియోను పరిశీలించి చివరికి ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అసంతృప్తిగానే పెవిలియన్‌కు వెళ్లాడు. తర్వాత శుభమ్ దూబే 25 పరుగులకు ఔటవగా.. పావెల్ కీలక సమయంలో వెనుదిరగడంతో రాజస్థాన్ ఓటమి ఖాయమైంది. చివరికి రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 201 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, ముకేశ్ కుమార్ 2 , కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి చేరుకుంది. మరోవైపు రాజస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

Also Read :Mayawati Heir : మాయావతి సంచలన నిర్ణయం.. ‘రాజకీయ’ వారసుడిపై వేటు

  Last Updated: 08 May 2024, 07:40 AM IST