Site icon HashtagU Telugu

DC vs KKR: చెలరేగిన కుల్ దీప్…ఢిల్లీదే విజయం

Delhi Capitals

Delhi Capitals

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61, పృథ్వీ షా 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రిషభ్ పంత్ అక్షర్ పటేల్ , శార్దూల్ ఠాకూర్ మెరుపులు మెరిపించారు. కోల్ కత్తా బౌలర్లలో నరైన్ 2 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, రస్సెల్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్య చేధనలో కోల్ కత్తా ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. రహానే , వెంకటేష్ అయ్యర్ ధాటిగా ఆడలేక పోయారు. వీరిద్దరూ ఔటయ్యాక…శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేకపోయారు. కేకేఆర్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 54, నితీష్‌ రాణా 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో బిల్లింగ్స్ , రస్సెల్ ధాటిగా ఆడటానికి యత్నించినా ఢిల్లీ బౌలర్లు మాత్రం అందుకు అవకాశమివ్వలేదు. గత మ్యాచులో 15 బంతుల్లోనే 56 పరుగులు చేసిన ప్యాట్ కమిన్స్.. ఈసారి మాత్రం 4 పరుగులే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రసెల్ ఆఖరుదాకా క్రీజులో ఉన్నా అతడు పెద్దగా మెరపులు మెరిపించలేకపోయాడు. దీంతో కోల్ కత్తా 171 పరుగులకు కుప్పకూలింది.
ఢిల్లీ బౌలర్లలో కుల్ధీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు, ఖాలీల్‌ ఆహ్మద్‌ మూడు, శార్ధూల్‌ ఠాకూర్‌ రెండు, లలిత్‌ యాదవ్‌ ఒక వికెట్‌ సాధించారు. వరుసగా రెండు విజయాల తర్వాత కోల్ కత్తాకు ఇది మొదటి ఓటమి కాగా.. రెండు పరాజయాల అనంతరం ఢిల్లీకి తొలి గెలుపు.

Exit mobile version