Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!

మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 06:42 AM IST

మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముంబై జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 110 పరుగులు చేసి విజయం సాధించింది.

ఏడు మ్యాచ్‌ల్లో ఢిల్లీకిది ఐదో విజయం. దింతో ఢిల్లీ జట్టుకు 10 పాయింట్లు వచ్చాయి. ముంబై కూడా ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి 10 పాయింట్లను కలిగి ఉంది. అయితే నెట్ రన్‌రేట్‌లో ఢిల్లీ కంటే వెనుకబడి ఉంది. ఢిల్లీ నెట్ రన్ రేట్ +1.978, ముంబై నెట్ రన్ రేట్ +1.725. ముంబై తన చివరి మ్యాచ్‌లో మంగళవారం (మార్చి 21) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో ఆడాల్సి ఉంది. అదే సమయంలో యూపీ వారియర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాల్సి ఉంది.

Also Read: Deepak Chahar: ధోనీ రిటైర్మెంట్ పై తేల్చేసిన చాహర్

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తమ మ్యాచ్‌ల్లో గెలిస్తే 12-12 పాయింట్లు ఉంటాయి. ఓడిపోతే ఇద్దరికీ 10-10 పాయింట్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నెట్ రన్‌రేట్ ఆధారంగా ఫైనల్‌కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు. మరోవైపు ఒక జట్టు ఓడి, మరొక జట్టు గెలిస్తే, గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఢిల్లీ తరఫున కెప్టెన్ మెగ్ లానింగ్, అలిస్ క్యాప్సీ, షెఫాలీ వర్మ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ముగ్గురూ వేగంగా స్కోరు చేశారు. క్యాప్సీ అత్యధికంగా అజేయంగా 38 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 22 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. షెఫాలీ వర్మ 15 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 33 పరుగులు చేసింది.

ముంబై తరఫున పూజా వస్త్రాకర్ అత్యధికంగా 26 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 23, ఇస్సీ వాంగ్ 23, అమంజోత్ కౌర్ 19 పరుగుల వద్ద ఔటయ్యారు. అమేలియా కెర్ ఎనిమిది, హీలీ మాథ్యూస్ ఐదు, యస్తికా భాటియా ఒక్క పరుగు మాత్రమే సాధించారు. నటాలీ సెవార్డ్ బ్రంట్ ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఢిల్లీకి మారిజాన్ క్యాప్ కిల్లర్ నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. శిఖా పాండే, జెస్ జోనాసెన్‌లు కూడా తలా రెండు వికెట్లు సాధించారు. అరుంధతి రెడ్డికి ఒక వికెట్ దక్కింది.