Site icon HashtagU Telugu

DC vs GT: గుజరాత్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ… లోస్కోరింగ్ మ్యాచ్‌లో సంచలన విజయం

GT vs DC

Delhi Capitals

DC vs GT: ఐపీఎల్ 16వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ , డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఢిల్లీ లో స్కోరింగ్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గుజరాత్‌పై సంచలన విజయం సాధించింది.

బౌలర్ల ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్ చివరి వరకూ రసవత్తరంగా సాగి ఫ్యాన్స్‌ను అలరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే తడబడింది. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఢిల్లీ మరోసారి అదే ఆటతీరుతో నిరాశపరిచింది.

ఓపెనర్ ఫిల్ సాల్ట్ తొలి బంతికే డకౌటవగా.. సమన్వయ లోపంతో డేవిడ్ వార్నర్ రనౌటయ్యాడు. మిఛెల్ మార్ష్ స్థానంలో వచ్చిన రొస్కు 8, ప్రియమ్ గర్గ్ 10 పరుగులకే వెనుదిరిగారు. ఇక సీజన్ ఆరంభం నుంచీ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న మనీశ్ పాండే 1 పరుగుకే ఔటవడంతో ఢిల్లీ కేవలం 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్, హకీమ్ ఖాన్‌ ఆదుకున్నారు.

వీరిద్దరూ నిలకడగా ఆడుతూ ఆరో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ పటేల్ 27 రన్స్‌కు ఔటవదా… హకీమ్‌ఖాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో రిపల్ పటేల్ కూడా ధాటిగా ఆడడంతో ఢిల్లీ స్కోర్ 120 దాటింది. హకీమ్ ఖాన్ 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. నిప్పులు చెరిగిన గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ 4 ఓవర్లలో 11 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 2 , రషీద్‌ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉన్న గుజరాత్ టైటాన్స్‌ సునాయాసంగా 131 పరుగుల టార్గెట్‌ను ఛేదిస్తుందనిపించింది. అయితే ఢిల్లీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో వారిని కట్టడి చేయడమే కాదు వరుస వికెట్లు పడగొట్టి ఆధిపత్యం కనబరిచారు. తొలి ఓవర్‌లోనే వృధ్ధిమాన్ సాహా డకౌటవగా.. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌గిల్ 6 , విజయ్ శంకర్ 6 పరుగులకే వెనుదిరగ్గా… డేవిడ్ మిల్లర్ కూడా డకౌటవడంతో గుజరాత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హార్థిక్ పాండ్యా,. అభినవ్ మనోహర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. మనోహర్ 26 పరుగులకు ఔటైనా.. క్రీజులో పాండ్యా, తెవాటియా ఉండడంతో గుజరాత్ గెలుస్తుందనిపించింది. దీనికి తోడు 19వ ఓవర్‌లో తెవాటియా మూడు సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్‌లో విజయం కోసం 12 పరుగులు చేయాల్సి ఉండగా… ఇశాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. తెవాటియాను ఔట్ చేసి 6 పరుగులే ఇచ్చాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 125 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది మూడో విజయం కాగా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్‌కు ఇది మూడో ఓటమి.