GT vs CSK IPL 2023: హిస్టరీ గుజరాత్ వైపే.. చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా?

ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రెండు జట్లలోనూ పలువురు టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్‌

  • Written By:
  • Publish Date - March 31, 2023 / 06:47 PM IST

IPL 2023 GT vs CSK : ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రెండు జట్లలోనూ పలువురు టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్‌ ఉండడంతో హోరాహోరీ మ్యాచ్‌ను అంచనా వేస్తున్నారు. అయితే హిస్టరీ మాత్రం గుజరాత్ వైపే ఉండడంతో మరోసారి ఫేవరెట్‌గా ఆ జట్టునే చెబుతున్నారు. చివరగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచులన్నింట్లో విజయం గుజరాత్‌దే. గతేడాది తొలిసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (GT) ఎవరూ ఊహించని విధంగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో గుజరాత్ రెండుసార్లు తలపడింది. తొలి మ్యాచ్‌లో చెన్నై నిర్థేశించిన 170 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ ఛేదించింది. డేవిడ్ మిల్లర్ , రషీద్‌ ఖాన్ సూపర్ బ్యాటింగ్‌తో ఆ జట్టును గెలిపించారు.

ఆ తర్వాత మరోసారి వాంఖడే వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో చెన్నై 133 పరుగులకే పరిమితమైంది. తర్వాత వృద్ధిమాన్ సాహా , మాథ్యూ వేడ్ రాణించడంతో గుజరాత్ ఈ లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేజ్ చేసేసింది. ఇలా రెండు మ్యాచుల్లోనూ గుజరాత్‌దే పైచేయిగా నిలిచింది.

గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే ఇవాల్టి మ్యాచ్‌లో గుజరాత్‌నే ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అయితే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. గత సీజన్‌లో పలువురు స్టార్ ప్లేయర్స్‌ ఫామ్ లేమితో సతమతమవడంతోనే చెన్నై పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ సారి మినీ వేలం తర్వాత జట్టు కూర్పులో మార్పులతో చెన్నై బలంగానే ఉంది. ధోనీ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడం, బెన్ స్టోక్స్ లాంటి ఆల్‌రౌండర్ ఎంట్రీ, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌పై అంచనాలు పెరిగిన నేపథ్యంలో చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందని విశ్లేషిస్తున్నారు. అటు ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లలో చెన్నై రికార్డును చూస్తే పర్వాలేదనిపిస్తోంది. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏడు సార్లు టోర్నమెంట్ ఓపెనర్లు ఆడిన చెన్నై.. నాలుగు మ్యాచ్ లలో గెలిచి మూడింట్లో ఓడింది. కాగా ఈ సీజన్‌కు సంబంధించి చెన్నైని గాయాలు వెంటాడుతున్నాయి.

అలాగే అంతర్జాతీయ సిరీస్‌ల కారణంగా కొందరు ప్లేయర్స్‌ ఆలస్యంగా జట్టుతో చేరనున్నారు. లెఫ్టార్మ్‌ సీమర్‌ ముకేశ్ మొత్తం సీజన్‌కే దూరమవ్వడం కలవరపెడుతోంది. మరోవైపుఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ యావరేజ్‌ స్కోరు 170. ఛేజింగ్ చేసే టీం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అహ్మదాబాద్ స్టేడియంలో ఐదు పిచ్‌లు ఉన్నప్పటకీ.. టోర్నీకి మంచి ఆరంభాన్నివ్వాలన్న ఉద్ధేశంతో బ్యాటింగ్ పిచ్ రూపొందిస్తారని అంచనా వేస్తున్నారు.

Also Read:  IPL 2023 Opening Ceremony LIVE: ఐపీఎల్ కు గ్లామర్ షో.. రష్మిక, తమన్నా లైవ్ డాన్స్