Indian Super League : ఇండియన్‌ సూపర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ఓట‌మి

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 11:24 AM IST

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(హెచ్‌ఎఫ్‌సీ)కి చుక్కెదురైంది. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో హెచ్‌ఎఫ్‌సీ 0-1 తేడాతో ఏటీకే మోహన్‌బగాన్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఏటీకే తరఫున హ్యుగో బౌమోస్‌(11ని) ఏకైక గోల్‌ చేశాడు. వివేకానంద యువభారతి క్రీడాంగణంలో ఏటీకేను ఓడిద్దామనుకున్న హెచ్‌ఎఫ్‌సీకి నిరాశ ఎదురైంది. ఏటీకే గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా హెచ్‌ఎఫ్‌సీ స్ట్రెకర్లు దాడి చేసినా అనుకున్న ఫలితం దక్కలేదు. దీంతో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఒక డ్రా, రెండు ఓటములతో హెచ్‌ఎఫ్‌సీ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 13 పాయింట్లతో ఏటీకే నాలుగో స్థానానికి ఎగబాకింది. లీగ్‌లో ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా భావిస్తున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌, ఏటీకే మోహన్‌బగాన్‌ ఆది నుంచే జోరు కనబరిచాయి.

కేరళ బ్లాస్టర్స్‌ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న హెచ్‌ఎఫ్‌సీ తిరిగి గెలుపు బాట పట్టాలన్న పట్టుదల ప్రదర్శించగా, సొంతగడ్డపై సత్తాచాటేందుకు ఏటీకే తహతహలాడింది. వివేకానంద యువభారతి క్రీడాంగణం వేదికగా రెండు జట్లు మొదటి నిమిషం నుంచే హోరాహోరీగా తలపడ్డాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా కొనసాగుతున్న హెచ్‌ఎఫ్‌సీ.. ఏటీకేను కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకుంది. ప్రత్యర్థి వ్యుహాలను సమర్థంగా తిప్పికొట్టేందుకు హెచ్‌ఎఫ్‌సీ సర్వశక్తులతో సిద్ధమైంది. మ్యాచ్‌ మొదలైన 11వ నిమిషంలో ఏటీకే గోల్‌ఖాతా తెరిచింది. అశిక్‌ కురునియాన్‌ అందించిన పాస్‌ను స్ట్రెకర్‌ హ్యుగో బౌమోస్‌ నేర్పుగా గోల్‌ చేశాడు. దీంతో ఏటీకే 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల తేడాతో ఏటీకే ప్లేయర్‌ లిస్టన్‌ కొలాకో చేసిన గోల్‌ ప్రయత్నాన్ని హెచ్‌ఎఫ్‌సీ గోల్‌కీపర్‌ గుర్మీత్‌సింగ్‌ అడ్డుకున్నాడు. గాయంతో లీగ్‌కు దూరమైన స్టార్‌ గోల్‌కీపర్ లక్ష్మీకాంత్‌ కట్టిమణి స్థానంలో తుది జట్టుకు ఎంపికైన గుర్మీత్‌సింగ్‌ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మ్యాచ్‌ 24వ నిమిషంలో తొలిసారి పెనాల్టీ ఏరియాలోకి ప్రవేశించిన హెచ్‌ఎఫ్‌సీ గోల్‌ ప్రయత్నం నెరవేరలేదు. ఒగ్బాచె అందించిన పాస్‌ను నిఖిల్‌ పుజారీ గోల్‌గా మలువలేకపోయాడు. ఇలా ఓవైపు తమ ఆధిక్యాన్ని పెంచుకునేందుకు ఏటీకే ప్రయత్నిస్తే స‌మం చేసేందుకు హెచ్‌ఎఫ్‌సీ ముమ్మరంగా ట్రై చేసింది.