Site icon HashtagU Telugu

Asia Cup: గెలిస్తేనే ఫైనల్ రేసులో నిలిచేది

india team

india team

ఆసియా కప్ టోర్నీ ఆరంభానికి ముందు భారత్ టైటిల్ ఫేవరెట్. దానికి తగ్గట్టే లీగ్ స్టేజ్ లో అదరగొట్టింది. పాక్ ను ఓడించి…హాంకాంగ్ పై గెలిచి సూపర్ 4 కు దూసుకొచ్చింది. అయితే సూపర్ 4 తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై పరాజయం పాలైంది. ఇప్పుడు ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లూ గెలిచి తీరాల్సిందే. దీనిలో భాగంగా ఇవాళ శ్రీలంకతో తలపడబోతోంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో అంతకుముందు మ్యాచ్‌తో పోలిస్తే పాక్‌తో మ్యాచ్‌లో కాస్త కుదురుకుంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలబడకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దాదాపు నెల గ్యాప్ తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ ఫామ్ అందిపుచ్చుకోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అతడు వరుసగా రెండు అర్ధ శతకాలు చేశాడు. అయితే మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. గత మ్యాచ్‌లో రిషభ్ పంత్ విఫలం కావడంతో.. ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో దినేశ్ కార్తీక్‌కు అవకాశమివ్వచ్చు. అలాగే ఆవేశ్ ఖాన్ తిరిగి జట్టులోకి వస్తే.. దీపక్ హుడాపై వేటుపడే అవకాశముంది.
గత మ్యాచ్‌లో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్ దారళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఈ సారి జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాహల్.. స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తీసుకునే అవకాశాలున్నాయి.అక్షర్ పటేల్‌ను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు శ్రీలంక ఉత్సాహంతో కనిపిస్తోంది. సూపర్-4 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఓడించి గ్రూప్ స్టేజ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ శనక, నిశాంక, కుశాల్ మెండిస్, గుణతిలక, రాజపక్స బ్యాటింగ్‌లో కీలకంగా మారారు. బౌలింగ్ విషయానికొస్తే స్పినర్లు హసరంగ, తీక్షణ రాణస్తున్నారు. వీరితో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందేననీ చెప్పొచ్చు. మొత్తం మీద ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు, మిడిలార్డర్ ఫాం లోకి రావడం పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి