Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వివాదాస్పద మోడల్ ఖుషీ ముఖర్జీ మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 2025 చివరలో సూర్యకుమార్‌పై ఖుషీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆమె చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.
మోడల్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా
గతంలో సూర్యకుమార్ యాదవ్ తనకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపేవారని ఖుషీ ముఖర్జీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సూర్యకుమార్ స్పందించకపోయినప్పటికీ అతని అభిమానులు మాత్రం తీవ్రంగా పరిగణించారు. ఉత్తరప్రదేశ్‌లోని గజీపూర్‌కు చెందిన ఫైజాన్ అన్సారీ అనే సూర్యకుమార్ అభిమాని ఖుషీ ముఖర్జీపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఖుషీ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, అవి కావాలనే స్టార్ క్రికెటర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అన్సారీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గజీపూర్ ఎస్పీ డాక్టర్ ఇరాజ్ రాజాని కలిసి, సదరు మోడల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన కోరారు. నివేదికల ప్రకారం.. ఈ చట్టపరమైన చిక్కుల నుండి బయటపడటానికి ఖుషీ ముఖర్జీ ఇప్పుడు క్షమాపణలు చెప్పి ఈ వివాదాన్ని ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: పిల్లలని ఈ సమయాల్లో అస్సలు తిట్టకూడదట!
ప్రస్తుతం సూర్యకుమార్ దృష్టి దేనిపై?
మైదానం బయట ఇన్ని వివాదాలు నడుస్తున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన ఆటపైనే దృష్టి సారించారు. భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సూర్యకుమార్ సన్నద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టులో అతని స్థానంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. జనవరి 21 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ సూర్యకుమార్‌కు అత్యంత కీలకం. ఈ సిరీస్‌లో భారీ స్కోర్లు సాధించి తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. క్రికెట్ పరంగా సూర్యకుమార్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చి పాత సూర్యను గుర్తుచేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
